కమల హాస్పిటల్‌లో తలసేమియా బాధిత చిన్నారిని పలకరిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ
2035 నాటికి లక్ష్యాన్ని చేరుకుందాం
ఈ వ్యాధికి చికిత్స అందించేందుకు మరో 3 కేంద్రాలు ఏర్పాటు
ఏషియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తలసేమియా రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అందరం కలిసి పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుందామని అన్నారు. తలసేమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కమల హాస్పిటల్‌లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, ఇతర నిపుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన సమస్యలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్, కౌన్సెలింగ్, సామాజిక అవగాహన కలి్పంచడమే సరైన మార్గమని, నివారణే అత్యుత్తమ చికిత్స అని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణీకి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.
11 లక్షల మందికి స్క్రీనింగ్
రాష్ట్రంలో సికిల్‌సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేసి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను డయాగ్నస్టిక్స్ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసి తలసేమియా లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.


