కేటీఆర్‌కు గదను బహూకరిస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్‌కు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు.
బండ్లగూడ మాజీ మేయర్ లతాప్రేమ్‌గౌడ్, వారి అనుచరులు ఆదివారం తెలంగాణభవన్‌లో కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు తగ్గడానికి, పరిస్థితులు దిగజారడానికి సన్నాసి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు.
బీజేపీ బలం గాలివాటమే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్‌ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహం, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్‌పై ఘన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు.
బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు సర్పంచ్‌ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని చెప్పారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులతోనే బీజేపీ గెలిచిందే తప్ప, ఆ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీచేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.


