ఇన్‌స్టాల్ చేసుకున్న కోట్లాది మంది యూజర్స్
భారత్ లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల మొబైల్ దాడులు
ప్రపంచంలో పెరుగుతున్న ఆండ్రాయిడ్ మాల్వేర్
వెల్లడించిన స్కేలర్ థ్రెట్‌ల్యాబ్జ్ తాజా నివేదిక
సాక్షి, స్పెషల్ డెస్క్: టెలికం కంపెనీల దూకుడుతో దేశంలో ఇంటర్నెట్ సేవలు పల్లెలకూ చేరాయి. ఇంకేముంది టెక్నా లజీ వినియోగం అంతకంతకూ పెరుగు తోంది. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధమైంది. హానికరమైన సాఫ్ట్‌వేర్లతో మొబైల్, కంప్యూటర్లలోకి చొరబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మాల్‌వేర్ పెరుగుతోంది. ఈ ముప్పు ఒక్క భారత్‌కే కాదు.. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాకు సైతం ఇది తలనొప్పిగా పరిణమించింది.
239 మాల్‌వేర్ యాప్స్..
క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ స్కేలర్ థ్రెట్‌ల్యాబ్జ్ 2025 మొబైల్, ఐఓటీ, ఓటీ థ్రెట్ నివేదిక ప్రకారం 2024 జూన్ నుంచి 2025 మే మధ్య గూగుల్ ప్లే స్టోర్‌లో 239 హానికరమైన అప్లికేషన్లు (మాల్‌వేర్) వచ్చి చేరాయి. అంతర్జాతీయంగా మొత్తం 4.2 కోట్ల మంది వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఆండ్రాయిడ్ మాల్‌వేర్ దాడులు గతేడాదితో పోలిస్తే 67 శాతం పెరిగాయి. అయితే స్మార్ట్‌ఫోన్లపై దాడులకు సైబర్ నేరగాళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌ను ఎంచుకున్నారని నివేదిక వెల్లడించింది.
ఏమిటీ మాల్‌వేర్?
మాల్‌వేర్ అనేది హానికరమైన సాఫ్ట్‌వేర్. ఇది కంప్యూటర్ సిస్టమ్స్‌కు హాని, డేటాను దొంగిలించేందుకు.. అనధికారికంగా మొబైల్, కంప్యూటర్‌లోకి చొరబడేందుకు సైబర్ నేరస్తులు రూపొందించిన ఒక ప్రోగ్రామ్. ఇది కంప్యూటర్ పనితీరులో అంతరాయంతోపాటు ఇతర నష్టాన్ని కలిగిస్తుంది.
మొబైల్ చెల్లింపులు లక్ష్యంగా..
గూగుల్ ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పాదకత, ఆటోమేషన్, టాస్‌్క, డేటా మేనేజ్‌మెంట్, కస్టమైజేషన్ వంటి హైబ్రిడ్, వర్క్‌ఫ్లో యాప్స్ కోసం వెతుకుతున్న వినియోగదారులే లక్ష్యంగా మాల్‌వేర్ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది. టూల్స్ విభాగంలో చేరిన ఈ హానికరమైన యాప్స్ వినియోగదారులను ఎక్కువగా తప్పుదోవ పట్టిస్తున్నాయని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ల జోరు కొనసాగుతుండటంతో కార్డు–కేంద్రీకృత మోసాలకు బదులుగా సైబర్ నేరగాళ్లు మొబైల్ చెల్లింపులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. యూజర్ల కార్యకలాపాలను రహస్యంగా పర్యవేక్షించి సమాచారాన్ని దొంగిలించే స్పైవేర్, ఆర్థిక మోసాల కోసం ఉపయోగించే బ్యాంకింగ్ మాల్‌వేర్ పెరగడం వల్లే ఆండ్రాయిడ్ మాల్‌వేర్ దాడులు అధికమయ్యాయని నివేదిక వివరించింది.
మూడు ప్రధాన ప్రాంతాల్లో..
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ బెదిరింపులు మూడు ప్రధాన ప్రాంతాల్లో అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక వివరించింది. ఇందులో 26% వాటాతో అత్యధిక కార్యకలాపాలు భారత్‌లో జరుగుతున్నాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే మొబైల్ బెదిరింపు దాడులు భారత్‌లో 38% ఎక్కువయ్యాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) దాడులకు అమెరికా కేంద్రంగా ఉంది. ఐఓటీ ఆధారిత మాల్‌వేర్ కార్యకలాపాల్లో అమెరికా ఏకంగా 54% వాటా కలిగి ఉంది. 15% వాటాతో ఆ తర్వాతి స్థానంలో హాంకాంగ్ నిలిచింది.
గిట్టుబాటయ్యే రంగాలపై..
గరిష్ట ప్రభావాన్ని అంటే అధిక ఆదాయం వచ్చే రంగాల వైపు దాడులు చేసేందుకే సైబర్ నేరస్తులు మొగ్గుచూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇంధన రంగంలో దాడులు ఏకంగా 387% పెరిగాయి. ఇది కీలక మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న ముప్పును సూచిస్తోందని నివేదిక వివరించింది. తయారీ, రవాణా రంగాలు ఐఓటీ మాల్‌వేర్ విభాగంలో అత్యంత తరచుగా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా పెట్టుకున్న విభాగాలుగా ఉన్నాయి. మొత్తం ఐఓటీ మాల్‌వేర్ సంఘటనల్లో 40% కంటే ఎక్కువ వాటాను ఈ రెండు విభాగాలు కలిగి ఉన్నాయి.

» ఆండ్రాయిడ్ వాయిడ్ మాల్‌వేర్ 16 లక్షల ఆండ్రాయిడ్ ఆధారిత టీవీ బాక్స్‌లకు సోకింది. ప్రధానంగా భారత్, బ్రెజిల్ దీని బారినపడ్డాయి.
» రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ఆర్‌ఏటీ), ఎక్స్‌నోటీస్ మాల్వేర్స్ చమురు, సహజవాయువు పరిశ్రమలో ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి.


