నెలకు సగటున రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.19 వేల కోట్లు
రాబడుల పద్దు బాకీ రూ. 1.2 లక్షల కోట్లు
వెల్లడించిన కాగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ. లక్షన్నర కోట్లు ఖర్చయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.84 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, 8 నెలల కాలంలో అంటే నవంబర్ నాటికి రూ. 1.66 లక్షల కోట్లు రాబడి వచ్చిందని, అందులో 1.54 లక్షల కోట్లు ఖర్చయ్యాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నాలుగు నెలల సమయం ఉండగా, ప్రభుత్వ అంచనా ప్రకారం మరో 1.2 లక్షల కోట్లు రాబడులు రావాల్సి ఉంది.
ఖర్చు అనివార్యం : కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు ప్రతి నెలా సగటున ప్రభుత్వ ఖజానాకు రూ.19 వేల కోట్ల వరకు సమకూరుతోంది. ఇందులో రెవెన్యూ పద్దు కింద (ప్రభుత్వ నిర్వహణ) రూ.5,500 కోట్ల వరకు ఖర్చవుతుండగా, ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కింద మరో రూ.5,500 కోట్లు అవసరమవుతున్నాయి.
గతంలో చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపు కింద నెలకు సగటున రూ.2,300 కోట్లు అవసరమవు తుండగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం రూ.1200 కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. మరో రూ.4వేల కోట్లకు పైగా ప్రతి నెలా మూలధన వ్యయం కింద ఖర్చవుతున్నట్టు కాగ్ లెక్కలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాబడులు, వ్యయ పద్దులు జోడెద్దుల్లా ముందుకెళ్తుండటం అటు పాలక వర్గాలను, ఇటు ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలు పెరిగితేనే ఇతర పథకాల అమలు సాధ్యమవుతుందని, ఇదే పరిస్థితి కొనసాగితే యథాతథంగానే పాలన ఉంటుందని ఆర్థిక నిపుణులు చెపుతుండటం గమనార్హం.


