ఐఫోన్, నిమ్మ సోడా! | Instamart annual report | Sakshi
Sakshi News home page

ఐఫోన్, నిమ్మ సోడా!

Dec 24 2025 6:06 AM | Updated on Dec 24 2025 6:06 AM

Instamart annual report

మారుతున్న వినియోగదారుల ఇన్‌స్టంట్‌ కొనుగోళ్లు

రూ.4.3 లక్షల సింగిల్‌ బిల్లుతో ఆశ్చర్యపరిచిన ఓ హైదరాబాదీ

రెడ్‌ బుల్‌కు రూ.16 లక్షలు వెచ్చించిన ముంబైకర్‌

రోజూ కరివేపాకు ఆర్డర్‌ పెట్టిన కొచ్చి కస్టమర్‌

ఆసక్తి రేపుతున్న ఇన్‌స్టామార్ట్‌ వార్షిక నివేదిక

దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్‌ సైట్లలో ఆర్డర్‌ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది! కాలంతో పోటీపడుతూ క్విక్‌ కామర్స్‌ సంస్థలు చిటికెలో ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇన్‌స్టంట్‌ విధానానికే ఇప్పుడందరూ జై కొడుతున్నారు. అది ఎంతగా అంటే రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్‌ను కూడా ఇన్‌స్టంట్‌గా పొందే అంత! అదొక్కటే ఆర్డర్‌ పెడితే మజా ఏం ఉంటుందనుకున్నాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు ఐఫోన్‌తోపాటు ఒక నిమ్మ సోడా కూడా జోడించారని క్విక్‌ కామర్స్‌ కంపెనీ ఇన్‌స్టామార్ట్‌ వార్షిక నివేదిక చెబుతోంది.   – సాక్షి, స్పెషల్‌ డెస్క్

10 నిమిషాల్లో డెలివరీ హామీతో.. 
బెంగళూరు వినియోగదారుడు రూ. 10 ఖరీదు చేసే ప్రింట్‌ అవుట్‌ మొదలు.. మూడు ఐఫోన్ల కోసం ఓ హైదరాబాదీ పెట్టిన రూ. 4.3 లక్షల విలువైన సింగిల్‌ ఆర్డర్‌ వరకు దేశంలో క్విక్‌ కామర్స్‌ పోకడలపై హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్‌ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ‘10 నిమిషాల’డెలివరీ హామీతో క్విక్‌ కామర్స్‌ కంపెనీలు భారత రిటైల్‌రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోంది.  

కరివేపాకూ ఉండాల్సిందే.. 
ఇన్‌స్టామార్ట్‌ వేదికగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కిగాను 9 ప్రధాన నగరాల్లో రాత్రివేళ ఆర్డర్స్‌లో మసాలా ఆలు చిప్స్‌ టాప్‌లో నిలిచాయి. కొచి్చకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్‌ పెట్టాడు. మరోవైపు లక్నోకు చెందిన ఓ కస్టమర్‌కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మేజిక్‌ మసాలా నూడుల్స్‌ను డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యే ఎక్కువగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.  

ఖరీదైనా సరే..
ఏడాది మొత్తంలో ఓ కస్టమర్‌ ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించారంటే క్విక్‌ కామర్స్‌ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్‌–17 మోడల్‌లో 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్‌ కాయిన్స్, ఫిలిప్స్‌ ఎయిర్‌ ఫ్రైయర్‌.. ఇలా ఒకటేమిటి పాలు, గుడ్లు, ఐస్‌క్రీమ్, పండ్లను సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లలో ఉన్నాయి. అలాగే నోయిడావాసి సింగిల్‌ ఆర్డర్‌లో ఏకంగా రూ. 2.69 లక్షలతో బ్లూటూత్‌ స్పీకర్స్, ఎస్‌ఎస్‌డీలు ఆర్డర్‌ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్‌ రూ. 1.97 లక్షలు వెచ్చించి ఒక కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండోమ్స్‌ కోసం 228 ఆర్డర్లు పెట్టి రూ. 1,06,398 ఖర్చు చేశారు.  

స్విగ్గీ వేదికగా ఇలా... 
ఈ ఏడాది కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్‌ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్‌ బిర్యానీలు ఉన్నాయి.  
వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. 
మధ్యాహ్నం 3–7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాయ్‌లను ఆస్వాదించారు. 

69 లక్షల వైట్‌ చాక్లెట్‌ కేక్స్, 54 లక్షల చాక్లెట్‌ కేక్స్, 45 లక్షల గులాబ్‌ జామూన్స్‌ ఆర్డర్లున్నాయి. 
కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్‌ ఫుడ్‌ రుచి చూశారు.  
రూ. 47,106తో 65 బాక్సుల డ్రై ఫ్రూట్‌ కుకీస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. 

ఓ ముంబైకర్‌ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్‌లో నిలిచాడు.  
ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్‌–3లో ఉన్నాయి. 
స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్స్‌ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. 
బెంగళూరుకు చెందిన మొహమ్మద్‌ రాజిక్‌ అనే డెలివరీ పార్ట్‌నర్‌ 11,718 డెలివరీలతో టాప్‌లో నిలిచాడు.  

ఇన్‌స్టామార్ట్‌ కస్టమర్ల రేంజ్‌ ఇదీ..
రెడ్‌బుల్‌ షుగర్‌ ఫ్రీ డ్రింక్స్‌ కోసం ముంబై కస్టమర్‌ ఏకంగా రూ. 16.3 లక్షలు ధారపోశాడు. 
ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. 
బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.36 లక్షల విలువైన నూడుల్స్‌ కొనుగోలు చేశాడు.  

 నోయిడా కస్టమర్‌ రూ. 2.8 లక్షలతో 1,343 ప్రొటీన్‌ ఉత్పత్తులు ఆర్డర్‌ చేశాడు. 
చెన్నై కస్టమర్‌ పెట్‌ ఫుడ్‌ కోసం రూ. 2.41 లక్షలు ఖర్చుపెట్టాడు. 
గులాబీలకు రూ. 31,240 వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. 

డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌కు టిప్స్‌ రూపంలో బెంగళూరు కస్టమర్‌ రూ. 68,600, చెన్నైవాసి రూ. 59,505 అందించారు. 
వాలెంటైన్స్‌ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్లు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement