పురపాలికల్లో పై‘చేయి’ | Congress wins majority of municipal elections in Telangana | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో పై‘చేయి’

Feb 17 2026 1:05 AM | Updated on Feb 17 2026 1:07 AM

Congress wins majority of municipal elections in Telangana

టార్గెట్‌ పెట్టుకుని మరీ మున్సిపాలిటీలు దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌

81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లతో పట్టణ స్థానిక సంస్థలపై పట్టు 

పెండింగ్‌ పడిన మున్సిపాలిటీలనూ దక్కించుకునేలా పావులు  

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో వ్యూహాత్మక వైఖరి... పట్టుపట్టి సాధించిన ఉత్తమ్, మహేశ్‌గౌడ్‌ 

కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్‌ డిమాండ్లకు చెక్‌ 

ఎక్కువ శాతం పుర పీఠాలు బీసీలకే ఇచ్చామంటున్న గాంధీ భవన్‌ వర్గాలు 

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో వ్యూహాత్మక వైఫల్యంపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: అనుకున్నట్టుగానే పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లతోపాటు సింహభాగం మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లను తన ఖాతాలో వేసుకుంది. కనీసం 90 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టణ స్థానిక సంస్థల్లో పట్టు సాధించగలిగింది. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో భాగంగా 81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

వీటితోపాటు నలుగురు స్వతంత్రులు, ఒక ఏఐఎఫ్‌ బీ అభ్యర్థి గెలుపొందిన స్థానాలు కూడా కాంగ్రెస్‌ మద్దతుతోనే వచ్చాయి. ఈక్రమంలో మరో 11 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎంపిక ప్రక్రియ మిగిలి ఉండగానే, 86 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. ఇక, పెండింగ్‌ లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ పీఠాలు తమవేననే ధీ మా అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.  

ఆది నుంచీ ఆచితూచి 
పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ నాయకత్వం సమన్వయంతో వ్యవహరించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. వీరికి తోడు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు, పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నేతలు, కార్పొరేషన్‌ చైర్మన్లు ఎవరికి వారు పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.

పీసీసీ ఏర్పాటు చేసిన వార్‌రూం కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికల దిశలో నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. ప్రతి రోజూ ఎన్నికల సరళిని పర్యవేక్షించిన ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేశారు. గత నెలలో తన విదేశీ పర్యటనకు ముందు, ఆ తర్వాత రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

రేవంత్‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నేరుగా తన మాటలతో ఢీ కొట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగలిగారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయం దిశగా ముందుకు నడిపించారు.  

మెదక్‌లోనే... ఓ మోస్తరు 
పోయిన దగ్గరే వెతుక్కోవాలనే నానుడి చందంగా.. మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్లలో కొంతమేరకు ప్రతికూల ఫలితాలు వచి్చన ప్రాంతాల్లో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాని నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునే విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 90శాతానికి పైగా దక్కించుకోగా, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు, మెదక్‌లో ఓ మోస్తరు ఫలితాలను సాధించగలిగింది.

మరీ ముఖ్యంగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పట్టుపట్టి మరీ అధికార పార్టీ చేజిక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత స్థానం కావడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని ఎంఐఎం సహకారంతో మేయర్‌ పీఠంపై కూర్చోగలిగింది. సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఒక మెట్టు తగ్గి కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వడంలోనూ తాము చాకచక్యంగా వ్యవహరించామ ని గాం«దీభవన్‌ వర్గాలు అంటున్నాయి.

ఇక్కడ మేయర్‌ పీఠం సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్తులో చేసే రాజకీయ పదవుల డిమాండ్‌కు చెక్‌ పెట్టగలిగామని అంటున్నాయి. ఇక, పుర పీఠాలనూ ఎక్కువ శాతం బీసీ వర్గాలకు కేటాయించామని, ఆయా వర్గాలకు రిజర్వ్‌ చేసిన స్థానాలతోపాటు రిజర్వు చేయని మున్సిపాలిటీలను కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించామని చెబుతున్నాయి. తాము చెప్పిన విధంగా 50 శాతం కంటే ఎక్కువ బీసీలకు అవకాశం కలి్పంచామని కూడా పేర్కొంటున్నాయి. అయితే, ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం దక్కించుకునే విషయంలోనే వ్యూహాత్మక వైఫల్యం జరిగిందని, దీనిపై సమీక్ష చేస్తామని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement