ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం | Moosapet incident | Sakshi
Sakshi News home page

ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం

Feb 17 2026 4:19 AM | Updated on Feb 17 2026 4:19 AM

Moosapet incident

నాలుగురోజులపాటు కుటుంబ సభ్యుల ప్రార్థనలు

దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం 

మూసాపేట (హైదరాబాద్‌): మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఇంట్లోనే ఉంచుకోవటంతో దుర్వాసన వెలువడి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  వివేకానందనగర్, రామకృష్ణనగర్‌ వీధిలో శ్రీసాయి భరద్వాజ్‌ అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులోని అద్దె ఇంట్లో తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో నివాసం ఉంటోంది. భర్త రిటైర్డ్‌ ఎస్‌ఐగా చేసి గతంలోనే మరణించాడు. భర్తకు వచ్చే పింఛన్‌ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ముగ్గురికి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపునకు తాళం వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపుతట్టగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తలుపు వేసుకున్నారు. సోమవారం కూడా మృతదేహాన్ని అలాగే ఉంచటంతో దుర్వాసన ఎక్కువైంది. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మృతదేహాన్ని తరలించాలని సూచించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పటంతో చివరికి వారి సొంత ఊరు కైకలూరికి అంబులెన్స్‌లో తరలించారు. అయితే గతంలో వాచ్‌మన్‌పై దాడి చేసింది కూడా వీరేనని, అద్దె డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని స్థానికులు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement