ప్రయాణికుల ‘బరువు మోత’కు ఆర్టీసీ పరిష్కార యత్నం
ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు
ప్రయాణికుల స్పందన ఆధారంగా మిగతా
వాటిల్లో బిగించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జిల్లా సర్వీసుల్లో బస్సెక్కగానే ప్రయాణికులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగులను బస్ అటక(ర్యాక్స్) మీద పెట్టేస్తారు... ఆ బరువు మోసే అవసరం వారికి ఉండదు. కానీ, హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఆ వసతి లేదు. దీంతో ప్రయాణికులు బరువు ఎంతున్నా, బ్యాగులను మోస్తూ నిలబడాల్సిందే. ఈ విషయంలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో చాలా మంది ఈ విషయంలో ఆర్టీసీ పరిష్కారం చూపాలని కోరినా, బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ, సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు...
జిల్లా సర్వీసుల్లాగా ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఎక్కువసేపు ప్రయాణించే పరిస్థితి ఉండదు. కానీ, ప్రయాణించే సమయం తక్కువే అయినా, ఎక్కువ బరువుతో ప్రయాణించేవారు లగేజీ పెట్టుకునే స్థలం లేక మోస్తూ నిలబడాల్సి వస్తోంది. సిటీ బస్సుల్లో ఎక్కువ సమయం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఆ సమయంలో నిలబడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు వారి బ్యాగులను కింద పెట్టే వీలు కూడా ఉండదు.
తప్పని పరిస్థితిలో మోస్తూ ఉండాల్సిందే. పాఠశాల విద్యార్థులు భారీ బ్యాగులను మోస్తూ, రద్దీ మధ్యలో మెసలడం.. వారికి, తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత రెండు బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించింది. ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తొలిదశలో 150 బస్సుల్లో అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా, తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో బస్సుకు రూ.15 వేలు...
ఆర్టీసీకి ప్రత్యేకంగా మియాపూర్‌లో బస్‌బాడీ నిర్మాణ విభా గం ఉంది. సొంతంగా సిబ్బందే బస్సు బాడీలను తయారు చేసే సామర్థ్యం ఉన్న వారు కావటంతో, ఈ పనిని కూడా వారికే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.15 వేల ఖర్చు అవుతుందని తేల్చారు. ప్రస్తుతం ఆ బస్సుల్లో అట కలు ఏర్పాటు చేసే పని జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు అటకలతో తిరగనున్నాయి. అవి ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉన్నాయా, సిటీ రద్దీ నేపథ్యంలో అవి అంతగా వినియోగించుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది గుర్తించి... మిగతా బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఒకచోట కాకుండా అటూ ఇటూ మారుతుంటారు. అలాంటప్పుడు ఈ ర్యాక్స్‌ను వినియోగించుకోవటం అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది పరిశీలించనున్నారు.
అప్పట్లో పార్టీషన్ పేరుతో వృథా వ్యయం...
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు–పురుష ప్రయాణికులు కలిసిఉండే వీలు లేకుండా ప్రత్యేక పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ వరుస సీట్లను తొలగించి మధ్యలో ఇనుప జాలీ తరహాలో స్లైడింగ్ డోర్‌తో కూడిన విభజనను ఏర్పాటు చేశారు. ఇందుకు ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఓ ఉన్నతాధికారి వీటి ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్ది రోజులకే ఆ ఏర్పాటు వృథా ప్రయాస అని తేలిపోయింది. మళ్లీ వాటిని తీసేసి, వాటి కోసం తొలగించిన సీట్లను తిరిగి ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే, తాజా నిర్ణయం ఉపయోగకరమైంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూలత ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.


