తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ
ఈనాడు సహా పలు మీడియా సంస్థలు, గూగుల్‌కు నోటీసులు
ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
ఇప్పటినుంచి రాసే కథనాలు కోర్టు పరిధికి లోబడి ఉంటాయని స్పష్టీకరణ
తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. – ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇకపై వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్.. సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
» గత ఏడాది నవంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ఠ దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపు రాతలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ (ఈనాడు), తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
» వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్... విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. ‘తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. చార్జిషీట్‌లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ, ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయి. విచారణ జరగకముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిట్ దర్యాప్తు సాగుతుండగానే, మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, వాదనల తదుపరి విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు.


