తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవాలు చేసినట్లుగా ఉందని ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. ‘ఈ రెండేళ్ళలో సంతృప్తికరమైన అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు.
రాష్ట్రంలో పరిస్థితి క్యాష్, సూట్‌కేసు, రాజేష్, లోకేష్.. అన్నట్టుగా మారింది. సంపద సృష్టిని చంద్రబాబు తన కుటుంబానికి చేసుకుంటున్నారు. మద్యం ఆదాయాలు ప్రభుత్వానికి రావటం లేదు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏఎంఆర్ సంస్థ చెక్‌పోస్టులు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూములను తమ బినామీలకు దోచి పెడుతున్నారు.
గీతం యూనివర్సిటీకి అక్రమంగా ఐదు వేల కోట్ల విలువైన భూములను దోచి పెట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్న చంద్రబాబు ఆ పేర్లు బయట పెట్టాలి. కుప్పానికి నీళ్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి చంద్రబాబు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల మీద పెట్రోలు బాంబులు దాడులు చేశారు’అంటూ ధ్వజమెత్తారు.


