కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...! | What is the benefit for Andhra Pradesh in the Union Budget | Sakshi
Sakshi News home page

కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...!

Feb 13 2026 10:30 AM | Updated on Feb 13 2026 12:12 PM

 What is the benefit for Andhra Pradesh in the Union Budget

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమిటి? ఈ ప్రశ్నకు ఎన్డీయే భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా సమాధానం చెప్పలేకున్నాయి. ప్రత్యేక కేటాయింపు లేవీ లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌లు ముక్తసరిగా ‘హర్షం’ వ్యక్తం చేశారు. ఏపీ దృష్టిపెట్టిన అంశాలపై దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుందని సీఎం, అభివృద్ధికి ఊతమని పవన్‌కళ్యాణ్‌, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని లోకేశ్‌లు పొడిపొడిగా వ్యాఖ్యానించారు.ఫలానా రంగానికి ఇన్ని నిధులు వచ్చాయని మాత్రం చెప్పలేకపోయారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. వేర్వేరు మంత్రులను కలిసి అధిక నిధులు కోరామని ప్రకటనలు గుప్పించినా లభించింది హళ్లికిహళ్లి.. సున్నకు సున్నా! అంతే! కానీ.. ఎల్లో మీడియా మాత్రం తెగ హడావుడి పడిపోయింది.


ఈనాడు పత్రిక కథనంలో..  అభివృద్ది బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ గుండా వెళతాయట. సెమీ కండక్టర్ 2.0తో ఏపీకి ప్రయోజనం అంటోంది. అదేసమయంలో  ఏపీ సమస్యలు, ఆర్థికలోటు వంటివి గాలికొదిలేసింది. పోలవరానికి రూ.3320 కోట్లు, అమరావతికి రూ.2000 కోట్లు వస్తాయని సంబరపడిపోయింది. అప్పుగా అమరావతికి డబ్బులిచ్చినా ఈనాడు చంకలు గుద్దుకుందన్నమాట. అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రతిపాదనకు కేంద్రం కొర్రీ పెట్టడంతో ఆలస్యమవుతోందని లేకుంటే ఎప్పుడో అయిపోయేదని కూడా చెప్పుకొచ్చింది ఈ పత్రిక చంద్రబాబు ఈ అంశంపై కూడా అమిత్‌ షాకు విన్నవించారని తెలిపింది.

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు. ఎందుకెళ్లారో స్పష్టత లేదు. పథకాలకు నిధుల కోసమా? తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ పెద్దలకు వివరణ ఇచ్చుకునేందుకా? ఇదీ కాకుండా.. ఇతరత్రా వ్యక్తిగత పనుల కోసమా? అన్నది తెలియదు. సహజంగానే బాకా పత్రికలు ప్రాజెక్టుల కోసమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమని కథనాలు ఊదాయి. చంద్రబాబు స్టైలు కూడా ఇలా లీకులివ్వడమే. కానీ పోలవరం విషయంలో ఈయన గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తే ఈ డొల్ల వ్యవహారం బట్ట బయలవుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పోలవరానికి కేంద్రం బడ్జెట్‌లో రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. ఇంత తక్కువ ఇచ్చారేమిటని కనీసం ప్రశ్నించలేని చంద్రబాబు రెండో దశకు రూ.32 వేల కోట్లు అడిగామని చెప్పుకుంటున్నారు. గత ఏడాది పోలవారినికి రూ.5000 కోట్లు కేటాయించినా.. అంచనాలను సవరించిన తరువాత దక్కింది రూ.మూడు వేల కోట్లే. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. చంద్రబాబు అండ్‌ కో అంకమ్మ శివాలెత్తేది. ‘రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు’’, ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవం మంటకలిసింది’’ అంటూ ఊగిపోయేది. గత ఢిల్లీ పర్యటనలోనూ రాయలసీమలో ఉద్యానవన హబ్‌ ఏర్పాటుకు రూ.41 వేల కోట్లు అడిగామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ తరువాత ఈ విషయం అయిపు అజా లేకుండా పోయింది.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ఏపీకి నష్టం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమతుంది. తొలిదశలో ఇలా ఉంటుంది, ఆ తర్వాత దానిని యథా ప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుంటుంది. కాని అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావసానికి అధిక నిధులు అవసరం అవుతాయి. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా కావాలి. కాని కేవలం మూడువేల కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్దికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్ లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటి పారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది.

కేంద్రంలో మోడీ ‍ప్రభుత్వం మనుగడకు టీడీపీ, జనసేనలకు ఉన్న పదిహేడు మంది ఎంపీల మద్దతు కీలకం. అయినా వీరు రాష్ట్రానికి సంబంధించి తగినన్ని నిధులూ సాధించలేకపోయారు.. కొత్త పథకాలూ వచ్చింది లేదు. ఏంటో వీరి బలహీనత! శీతకన్నేసినా... పట్టించుకోకపోయినా కేంద్రం సహకరిస్తోందన్న ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమెందుకో? స్కిల్‌స్కామ్‌లో ఈడీతో కూడా క్లీన్‌ చిట్‌ ఇప్పించుకున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయని.. ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనని వైసీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం.
 

గతంలో ప్రధానిని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ- తిరుపతి బుల్లెట్ ట్రైన్ లు వచ్చేస్తాయని చెప్పారన్న  విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీకిప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు కూడా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది మూడువేల కోట్లు కేటాయించినా, ఈసారి కేవలం వంద కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దానిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటువారికి అప్పగిస్తున్నారు. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధులలో కోత,గ్రామీణ ఉపాధి హామీ నిధులలో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని కూడా ప్రభావితం చేస్తాయి.

మరో వైపు  తెలంగాణ కు కూడా అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వాపోయారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న  మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కాని, మెట్రో విస్తరణకు కాని నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని నిధుల కోసం కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయినా బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమీ లేకుండా పోయింది. దీనిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement