దేశంలో ఫుడ్ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి యాప్‌లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.
అయితే ఇవే ఫుడ్ డెలివరి యాప్‌లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్ డెలివరి యాప్‌లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్‌ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్‌లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.
రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..
అధిక కమీషన్లు
ఫుడ్ డెలివరీ యాప్‌లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్‌లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్‌కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది.
సొంత డెలివరీ యాప్‌ల వైపు రెస్టారెంట్లు
అధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్‌లు, వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.
బ్రాండ్ విలువకు దెబ్బ
ఫుడ్ డెలివరీ యాప్‌లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్‌లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.


