దేశ ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించే కొత్త తరం రంగాలకి రుణ లభ్యతను పెంచే దిశగా చక్ర–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని (సీవోఈ) ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ–బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లులాంటి ఎనిమిది వర్ధమాన రంగాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.
2030 నాటికి ఈ ఎనిమిది రంగాలు దాదాపు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్దాల్లో కొత్త ఆవిష్కరణలు, అధునాతన తయారీ సామర్థ్యాల దన్నుతో భారత్ వృద్ధి చెందుతుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.
శ్వేతపత్రాలు, సెక్టార్ రిపోర్టులు, పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ మొదలైన మార్గాల్లో క్లయింట్లు, ఇన్వెస్టర్లు, విధాననిర్ణేతలు నిర్ణయాలు తీసుకునేందుకు చక్ర సెంటర్ తోడ్పడుతుందని వివరించారు. డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు, బహుళపక్ష ఏజెన్సీలు, పరిశ్రమ సమాఖ్యలు, స్టార్టప్‌ల మధ్య సంప్రదింపులకు ఇది సహాయకరంగా ఉంటుందన్నారు.


