అధునాతన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్‌కి సర్టిఫికేషన్ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్ బాబు చెప్పారు.
మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్ బాబు తెలిపారు.
ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్ బుక్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


