మరో ఆరుగురు మావోయిస్టులు కూడా మృతి
మారేడుమిల్లి సమీపంలోని జీఎం వలస వద్ద ఘటన
ఐఈడీల తయారీలో టెక్ శంకర్ దిట్ట
తలదాచుకునేందుకు వచ్చి ఎదురు కాల్పుల్లో మృతి
24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు
13కు చేరిన మృతుల సంఖ్య
వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్
రంపచోడవరం/చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో బుధవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జీఎం వలస అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బతుపురంకు చెందిన టెక్ శంకర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి అలియాస్ సరిత, ఏరియా కమిటీ సభ్యులు సురేశ్ అలియాస్ రమేశ్, లోకేశ్ అలియాస్ గణేశ్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి మృతి చెందారు.
ఇదే ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడివి హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవకముందే ఇదే ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకోగా.. ఏడుగురు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఇక్కడ జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మృతుల సంఖ్య 13కు చేరింది.
‘ఆపరేషన్ సంభవ్’లో భాగంగా..: ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్‌బర్దర్ రంపచోడవరంలో బుధవారం వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్‌లో భాగంగా భారీఎత్తున కూంబింగ్ చేపట్టగా.. రెండు రోజులపాటు మావోయిస్టులతో వరుస ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జీఎంవలస వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బతుపురంకు చెందిన టెక్ శంకర్ ఏవోబీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో శంకర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేశ్ అలియాస్ గణేశ్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి సైతం మరణించారని వివరించారు.
షెల్టర్ జోన్ కోసం వచ్చి..
ఘటనా స్థలంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, ఐదు ఎస్బీబీఎల్ తుపాకులు, 303 రైఫిల్, 18 డిటోనేటర్లతో పాటు మందుగుండు సామగ్రి స్వాదీనం చేసుకున్నట్టు ఎస్పీ అమిత్‌బర్దర్ తెలిపారు. షెల్టర్‌జోన్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్టు పక్కా సమాచారం అందటంతో ఆపరేషన్ సంభవ్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనల్లో 13 మంది మావోయిస్టులు హతమైనట్టు చెప్పారు.
ఇటీవల ఏవోబీలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిమిత్తం ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులను రప్పించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలో మావోయిస్టుల ఏరివేత నిమిత్తం ఆపరేషన్ సంభవ్ నిరంతరం కొనసాగిస్తామన్నారు. మారేడుమిల్లి ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పాటు ఎత్తయిన ఘాట్‌లు ఉన్నందున ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా వినియోగించుకుంటున్నారని చెప్పారు.
ఐఈడీల తయారీలో దిట్ట
తాజా ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఐఈడీల తయారీలో దిట్ట పేరొందారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు, జవాన్లు ప్రయాణించే వాహనాలను పేల్చేందుకు మావోయిస్టులు ఐఈడీలను సాధనంగా వినియోగిస్తారు. వీటిని అమర్చడంలో నైపుణ్యం కలిగిన టెక్ శంకర్ కొత్త టెక్నాలజీతో మందుపాతర్లను పేల్చడంలో నైపుణ్యం సంపాదించారు.


