ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. పర్యటించరాదని కాదు కానీ గతంలో వీరిద్దరూ వైఎస్ జగన్ లండన్ టూర్‌పై పిచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు ఈ రహస్య పర్యటన కాస్తా చంద్రబాబును రాష్ట్ర ప్రజల దృష్టిలో అభాసుపాలు చేసింది. కొందరు చేసిన పాపాలు ఎక్కడకు పోతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికారిక హోదాలో సీఎం లేదా మంత్రులెవరైనా విదేశీ పర్యటనకు వెళుతూంటే ముందుగానే టూల్ షెడ్యూల్ విడుదలవుతుంది. కొన్నిసార్లు ఈ పర్యటనల్లో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటూంటారు. పర్యటన వ్యక్తిగతమైందైనా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
చంద్రబాబు, లోకేశ్‌ల టూర్ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉండవచ్చు కానీ.. వ్యక్తిగత పర్యటనైనప్పటికీ ఏపీ ప్రజానీకానికి తెలియచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు పెద్దగా విలువలేకుండాపోయిందని, చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేశ్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ గోప్యంగా వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో ఉన్నప్పటికీ టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారని ఎల్లోమీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ.. ఎక్కడున్నారో మాత్రం చెప్పలేకపోయింది.
ఈ నేపథ్యంలో గతంలో జగన్ తన కుతుళ్ల గ్రాడ్యుయేషన్ ఉత్సవాలకు లండన్ వెళితే చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు. కన్న కూతుళ్లను చూడాలన్న అభిమానం పుట్టింది. ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. అక్కడ విమానం లాండింగ్ ఉండాలంటే విమానానికి గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే దగ్గర, దగ్గర రూ.30 - 40 కోట్లు మీ డబ్బు ఖర్చు పెట్టి, కూతుళ్లను చూడడానికి వెళ్లాడు’’అని ఆరోపించారు. లోకేశ్ కూడా ‘‘రూ.12 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. హాలిడేకి వెళ్లాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళతాడు. లండన్ వెళ్లి ఎక్కడ పడుకుంటాడు అని నేను అడిగానా? ఏ హోటల్‌కు వెళ్లాడని నేను అడిగానా?’’ అంటూ అనుచిత భాష వాడారు. ఖర్చు విషయంలో చెరోమాట మాట్లాడటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.
వాస్తవం ఏమిటంటే అప్పట్లో జగన్ లండన్ వెళ్లింది తన సొంత డబ్బుతో. ప్రభుత్వ సొమ్ముతో కానేకాదు. కానీ ఆ టూర్ సమయంలో ఎడాపెడా తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు రహస్య టూర్‌ను సమర్థించుకోలేక నానా పాట్లు పడుతోంది. టీడీపీ సోషల్ మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అప్పట్లో నీచంగా ధంబ్ నెయిల్స్ పెట్టారు. ‘‘జగన్ ప్రత్యేక విమానంలో ఏమీ తీసుకువెళ్లారు?’’ ‘‘ఆ సూట్ కేసులలో ఏముంది? డబ్బు తరలించారా?’’ ‘‘మధ్యలో విమానం ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది?’’ ‘‘ఆ దీవుల్లో బ్లాక్ మనీ దాచుకోవచ్చని వెళ్లారా?’’ అంటూ ఇలా రకరకాలుగా కథనాలు వండి వార్చారు. మెయిన్ మీడియాలో సైతం ఈ అంశాలపై చర్చలు జరిపారు. జగన్‌కు ఎల్లో మీడియా వేసిన ప్రశ్నలన్నీ ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లకు కూడా వర్తిస్తాయి కదా! వాటి గురించి మాట్లాడలేకపోయారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆరుసార్లు, లోకేశ్ తొమ్మిదిసార్లు విదేశీ యాత్రలు చేశారు. పెట్టుబడుల కోసం అని చెబుతున్నా, ఇంకేదో కారణం ఉంటుందన్నది పలువురి సందేహం. టీడీపీ విశ్లేషకులు ‘‘జగన్‌కు చెప్పి వెళ్లాలా? అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఆ తరువాత కానీ జగన్ సీబీఐ కోర్టు అనుమతితోనే టూర్ వెళ్లారు. లండన్ ఎయిర్ పోర్టులో వైసీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన వారు, అభిమానులు పలువురు ఆయనకు స్వాగతం చెప్పారు. కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాపరికం ఏదీ లేదు. అయినా ఎల్లో మీడియా ప్రజలలో అనుమానాలు వచ్చేలా పిచ్చి వార్తలు ప్రచారం చేసింది. వదంతులు సృష్టించడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఇప్పుడు పరిస్థితి చూడండి. కొత్త సంవత్సరం రావడానికి మూడు రోజుల ముందే లోకేశ్ విదేశీయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్లారు.వారెందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారో చెప్పలేని స్థితి. కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్లారని ప్రచారం జరిగింది.

అదే నిజమైతే అమరావతి, ఏపీ, విశాఖ లేదా తిరుపతి వంటి నగరాలలో వేడుక చేసుకోకుండా విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వస్తాయి. అయితే చంద్రబాబు, లోకేశ్‌లు లండన్ కే వెళ్లారా? సింగపూర్‌కు వెళ్లారా అన్నది తెలియదు. తనకు వెంటనే పట్టాభిషేకం జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని, అందుకే ఆ పంచాయతీ కోసం విదేశాలకు వెళ్లారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారా అని మాజీ ఎమ్మెల్యే సుధాకర బాబు నిలదీశారు. సీఎం పదవి ఇవ్వలేదని అలిగి లోకేశ్ ముందే విదేశానికి వెళితే, అతనిని బుజ్జగించడానికి చంద్రబాబు వెళ్లారా అని మరో నేత నాగార్జున యాదవ్ అడిగారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లారా? లేక హెరిటేజ్ డబ్బుతో వెళ్లారా? అన్నది ఎందుకు చెప్పడం లేదని ఆయన అన్నారు.
ఈ ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నది వేరే విషయం. జగన్ టూర్‌కు రూ.నలభై కోట్ల ఖర్చయి ఉంటుందని చంద్రబాబు ఆరోపించినందున, ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన తమ టూర్‌కు అంతే ఖర్చు చేశారా? ఇంకా ఎక్కువ చేశారా? జగన్‌ను ఉద్దేశించి అప్పట్లో అనుచితంగా వ్యాఖ్యానించిన లోకేశ్‌కు కూడా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవుతుంది కదా! గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు ఎలాపడితే అలా అసభ్యంగా మాట్లాడితే, జగన్ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడం సంస్కారయుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేశ్‌ల రహస్య విదేశీ యాత్ర వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కాని,తెలుగుదేశం పార్టీని,ఎల్లో మీడియాని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారా వ్యాఖ్యాత.


