మురమళ్లలో గత ఏడాది జరిగిన పందేలకు హాజరైన సినీనటులు
జిల్లాలో కోడి పందేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐ.పోలవరం, అల్లవరం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన మండలాల్లో కూడా పందేలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు పందేల బరుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. పోలీసులు అధికారికంగా అనుమతులు ఇవ్వకున్నా పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేసేలా చూడాలని, బరులకు అనధికార అనుమతులు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను చదును చేసి పందేల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. కోడి పందేలతోపాటు ఈ ఏడాది గుండాటలు కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశముంది. పందేల బరుల వద్దే గుండాటల కూడా నిర్వహించనున్నారు. ఈ తంతుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్ధకమైంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: ‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకుంటారు. అసలు కాదండోయ్.. ఇది అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే కోడి పందేలకు చేసిన రీల్స్.. సంక్రాంతి సమీపిస్తుండడంతో జూదరులను ఆకర్షించేందుకు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామనే పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ, పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ ముందు రోజు వరకూ పందేల నిర్వహణ, బరులు సిద్ధం చేయడాన్ని రహస్యంగా ఉంచేవారు.
ప్రభుత్వం మారిన తరువాత వారం పది రోజుల ముందు నుంచే కోడి పందేలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇది సరిపోదన్నట్టు ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీశారు. కోడి పందేల బరులతో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పందేల రీల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇలా పందేల కోసం బహిరంగంగానే ప్రచారం మొదలు పెట్టారు. కోడి పందేల బరులు, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు, ఎల్‌సీడీలు, కార్ పార్కింగ్‌లు.. ఇలా సర్వం రీల్స్‌లో చూపిస్తూ జూదరులను ఆకర్షిస్తున్నారు.
జిల్లాలో కోడి పందేలు అనగానే గుర్తొచ్చేది ఐ.పోలవరం మండలం మురమళ్ల. ఇక్కడ పండగ మూడు రోజులూ రూ.కోట్లలో చేతులు మారుతుంటాయి. టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే పందేలలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు హాజరవుతుంటారు. వీరితోపాటు అదనపు ఆకర్షణగా తెలుగు సినిమా నటులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే హైటెక్ బరులు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్‌సీడీ టీవీలు, గ్యాలరీ వంటివి అధునాతంగా ఉంటాయి. వీవీఐపీలకు ఆతిథ్యం అదనం. దీనికే ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కలి్పస్తున్నారు. ఇది రీల్స్‌లో అగ్రగామిగా నిలిచింది.
ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పందేలకు ఏర్పాట్లు చేస్తుండడంతో జూదరులు మరింత మంది పందేలకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ రీల్స్‌లో గత ఏడాది పందేలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సినీ నటులు కూడా కనిపిస్తున్నారు. దీనితో పాటు జిల్లాలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పులంక, అల్లవరం మండలం గోడి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగే వాటికి కూడా ప్రచారం మొదలైంది. కోడి పందేల నిర్వహణ చట్టరీత్యా నేరమైనా చంద్రబాబు ప్రభుత్వంలో దీనికి కూడా ఒక బ్రాండింగ్ కల్పించి ప్రచారం చేయడాన్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.


