తిరుపతి: ఆర్‌టీసీ బస్సుల్లో దూర ప్రయాణాలకు టికెట్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. గతంలో ఆధార్ ఆధారంగా సీట్ రిజర్వ్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చారు. కేవలం ఫోన్ నంబర్, ఊరు చెబితే టికెట్ రిజర్వేషన్ చేసేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. పురుషులైనప్పటికీ మహిళల పేరుతో సీట్ రిజర్వ్ చేసుకుంటున్నారు. దీంతో ఆడవారికి కేటాయించే సీట్లలో వీరికి రిజర్వేషన్ దొరుకుతోంది.
తర్వాత పక్క సీటులో కూర్చున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ తప్పుడు సమాచారం ఇచ్చి టిక్కెట్లు పొందుతున్నారు. ఆడవారి పక్క సీటుల్లో కూర్చుని వేధింపులకు దిగుతున్నారు. ఇటీవల తిరుపతి నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్‌టీసీ బస్సులో చిత్తూరుకు చెందిన ఓ యువతికి ఇవే ఘటనలు రెండు పర్యాయాలు ఎదురయ్యాయి. దీంతో ఆమె చిత్తూరు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు సైతం చేయడం గమనార్హం. ఈ తరహా పోకిరీలను అడ్డుకట్ట వేసే దిశగా ఆర్‌టీసీ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


