ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్న డీజిల్ బస్సులు
ముందుకొచ్చిన రెండు ప్రైవేటు సంస్థలు
ఒక్కో బస్సుకు రూ.65 లక్షల ఖర్చు
ఆ మొత్తాన్ని భరించనున్న ప్రైవేటు సంస్థలు
ఏడేళ్ల కాలంలో వడ్డీతో తిరిగి చెల్లించనున్న ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: పాత డీజిల్ బస్సులను కూడా రెట్రో ఫిట్‌మెంట్ పద్ధతిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుకోబోతోంది. డీజిల్ బస్సుల్లోంచి ఇంజిన్లు తొలగించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ల (బ్యాటరీ బస్సుల్లో వినియోగించేవి)ను అమర్చటం ద్వారా ఆ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా వాడుకోనుంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించింది. ఇందుకు ఆసక్తి చూపుతూ రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని వేశారు. మరో మూడునాలుగు రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ మేరకు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని బస్సులను అప్పగించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
పెట్టుబడి ప్రైవేట్ సంస్థలదే...
డీజిల్ బస్సులను రెట్రో ఫిట్‌మెంట్‌తో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుకునే పరిజ్ఞానం కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఐదారేళ్లుగా ఆర్టీసీ కూడా దీని అనుసరణకు ప్రయతి్నస్తోంది. కానీ, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో... పెట్టుబడి పెట్టే సంస్థల కోసం ఎదురుచూస్తూ వస్తోంది. గతంలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇవ్వటంతో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ఇటీవలే ఆ సంస్థలు కొటేషన్ ఇవ్వగా, వాటితో సంప్రదింపులు జరిపి కొంతమేర ఆ మొత్తాన్ని తగ్గించుకోగలిగింది.
ప్రస్తుతం ఒప్పందాలకు సిద్ధమైంది. ఇప్పుడు రెట్రో ఫిట్‌మెంట్ భారాన్ని ఆ సంస్థలే భరిస్తాయి. సొంత ఖర్చుతో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి ఆర్టీసీకి అందిస్తాయి. ఏడేళ్ల కాలంలో ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఆర్టీసీ సమ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్లపాటు ఆ సంస్థలే బస్సులను నిర్వహిస్తాయి. ఇందుకు కిలోమీటరుకు రూ.20 నుంచి రూ.25 మధ్య సర్విసు చార్జీని ఆర్టీసీ వాటికి చెల్లిస్తుంది. ఏడేళ్ల ఒప్పందం తీరిపోగానే ఆ బస్సుల్లోని ఎలక్ట్రిక్ మోటార్లు సహా ఇతర వ్యవస్థలు ఆర్టీసీ సొంతమవుతాయి. అప్పుడు ఆ మోటార్లను తిరిగి ఇతర డీజిల్ బస్సుల్లో అమర్చి వాటిని బ్యాటరీ బస్సులుగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఒక్కో బస్సుకు రూ.65 లక్షలు
ఒక్క డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు రూ.65 లక్షల వరకు ఖర్చవుతుందని తేల్చారు. ఈ మొత్తాన్ని తొలుత ఆ కంపెనీలే భరించి మారుస్తాయి. ఏడేళ్లలో ఈ మొత్తాన్ని తిరిగి ఆర్టీసీ నుంచి వడ్డీతో వసూలు చేసుకుంటాయి. ఏడేళ్లపాటు డీజిల్ బస్సు నిర్వహణ, అంతే సమయంలో రెట్రో ఫిట్‌మెంట్ బస్సు సిద్ధం చేసి నిర్వహించటం... ఈ రెండు ఖర్చులను సరిపోల్చి చూశారు. ఆరేళ్లలోనే రెట్రో ఫిట్‌మెంట్ వ్యయం తీరిపోతుందని తేలింది. అంటే, ఓ ఏడాది పాటు డీజిల్ బస్సు నిర్వహణ ఖర్చు మిగులుతుంది. ఇది ఆర్టీసీకి భారీ ఆదా.
⇒ ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ సంస్థల నుంచి అద్దెకు తీసుకుంటున్నారు. కండక్టర్ మినహా ఆ బస్సులో పనిచేసే సిబ్బంది అంతా ప్రైవేట్ సంస్థకు చెందిన వారే. అప్పుడు ఆర్టీసీలోని ఆయా సిబ్బందికి పనిలేకుండా పోతుందని సంస్థ భావిస్తోంది. కానీ, వారికి జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గానే చెల్లించాల్సి ఉంటుంది. అదే రెట్రో ఫిట్‌మెంట్ ఎలక్ట్రిక్ బస్సుల్లో సిబ్బంది అంతా ఆర్టీసీ వారే. వారికి చెల్లించే జీతభత్యాలకు తగ్గట్టుగా వారి వినియోగం ఉంటుంది. ఇక ప్రస్తుతం బ్యాటరీ బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సిబ్బందికి పరిజ్ఞానం లేదు. రెట్రో ఫిట్‌మెంట్ బస్సులను సొంత సిబ్బందే నిర్వహించనుండటంతో సిబ్బంది వాటిపై పూర్తి అవగాహన వస్తుంది. భవిష్యత్‌లో వాటి నిర్వహణ సులభమవుతుంది.
200 బస్సులతో మొదలు
ప్రస్తుతం 200 సిటీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కేటాయించే అవకాశం ఉంది. ఆ బస్సులను సిటీలో తిప్పుతారు. వాటి పనితీరు మెరుగ్గా ఉంటే తదుపరి మరిన్ని బస్సులను మారుస్తారు. ఏడేళ్ల తర్వాత ఈ 200 బస్సుల్లోని పరికరాలను మరో 200 బస్సుల్లోకి మార్చి వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా రోడ్డుపైకి తెస్తారు.


