అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్‌ | Despite Pressures I Stood Firm with the Madiga Community CM Revanth | Sakshi
Sakshi News home page

అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్‌

Mar 6 2026 6:54 PM | Updated on Mar 6 2026 7:09 PM

Despite Pressures I Stood Firm with the Madiga Community CM Revanth

హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోందని,  ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్‌మెంట్‌తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. 

అందుకే ఎన్ని  ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష‌తో 2023 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా ద‌గ్గ‌ర అధికార యంత్రాంగం, అక్ర‌మ సంపాద‌న లేదు..

చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.  ఎలా అయితే సాధించుకోవాల‌న్న త‌ప‌న‌తో కొంద‌రు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, క‌మిష‌న్లు,త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ స‌మ‌స్య‌ను ప్ర‌త్య‌క్షంగా నేను చూస్తూ వ‌స్తున్నాను.  మీరు కోట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలో నా చేత‌నైనా సాయం చేస్తూ వ‌చ్చాను. 

క్రిష్ణ మాదిగ‌, స‌తీష్ మాదిగ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చేత‌నైన సాయం చేసి అండ‌గా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఆనాటి పాల‌కులు సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, సంప‌త్ కుమార్ తో పాటు న‌న్ను బ‌య‌ట‌కు గెంటివేశారు. నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం.  కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు. నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించాను.. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement