టారిఫ్‌ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే.. | Finance Minister Nirmala Sitharaman comments on tariffs cut | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..

Feb 4 2026 2:40 PM | Updated on Feb 4 2026 2:52 PM

Finance Minister Nirmala Sitharaman comments on tariffs cut

భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.

‘మేడిన్‌ ఇండియా ఉత్పత్తులకు గుడ్‌ న్యూస్‌. ఇక వాటిపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్‌ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్‌ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్‌లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్‌ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై (ఎఫ్‌అండ్‌వో) సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్‌

అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్‌కి ‘చాలా మంచి‘ డీల్‌ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.

ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement