Union Budget 2026 :జిల్లాకో బాలికల హాస్టల్‌ | Nirmala Sitharaman Announces Girls Hostel To Every District | Sakshi
Sakshi News home page

Union Budget 2026 :జిల్లాకో బాలికల హాస్టల్‌

Feb 2 2026 1:08 PM | Updated on Feb 2 2026 1:11 PM

Nirmala Sitharaman Announces Girls Hostel To Every District

న్యూఢిల్లీ: దేశంలో పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్‌ కారిడార్లలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు, ప్రతీ జిల్లాలో ఒక బాలికల హాస్టల్, 15 వేల స్కూళ్లు, 500 కాలేజీల్లో కంటెంట్‌ క్రియేటర్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది. దేశంలో విద్యారంగానికి ఈసారి బడ్జెట్‌లో రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యారంగం వాటా రూ.55,727 కోట్లుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లోని పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్‌ కారిడార్లలో ఏర్పాటుచేసే ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లకు కేంద్రం సహకారం అందిస్తుంది. ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసే ఈ విద్యామండళ్లలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలు, స్కిల్‌ సెంటర్లు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 

బాలికలకు ఇబ్బందుల్లేకుండా...
దేశవ్యాప్తంగా 700 జిల్లాలుండగా జిల్లాకొక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ‘ఉన్నతవిద్యకు సంబంధించిన స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) సంస్థల్లో చదువుతున్న బాలికలు సుదీర్ఘమైన సమయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించేందుకు వీజీఎఫ్‌ (వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌)/పెట్టుబడుల సహకారంతో జిల్లాకొ క బాలికల హాస్టల్‌ను నిర్మిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. అలాగే, వెటర్నరీ కాలేజీలు, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీలకు లోన్‌ లింక్డ్‌ కేపిటల్‌ సబ్సిడీ పథకాన్ని ప్రతిపాదించారు. 

ముంబైలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటుకు, కంటెంట్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేసేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)ని ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అలాగే విద్యారుణాలకు, వైద్యచికిత్సలో ఉండే లిబరైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) మొత్తాలకు టీసీఎస్‌ (మూలం వద్ద పన్ను సేకరణ)ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ కింద భారతీయులు ఏడాది (ఏప్రిల్‌–మార్చి)కి 2.5 లక్షల డాలర్లను పంపేందుకు అనుమతిస్తారు.

 అయితే, విద్య, వైద్యచికిత్సలో కాకుండా మిగతా రంగాల్లో టీసీఎస్‌ యథావిధిగా 20 శాతం కొనసాగుతుందని పేర్కొన్నారు. సేవారంగంపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ‘ఎడ్యుకేషన్‌ టు ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌’కు అనే అత్యున్నత స్థాయీసంఘాన్ని నియమించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీన్ని వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించే బడ్జెట్‌గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభివర్ణించారు.  

Advertisement
 
Advertisement
Advertisement