దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు | Top 10 Bank Defaulters Owe Rs 40635 Cr Nirmala Sitharaman Reveals Action Plan | Sakshi
Sakshi News home page

దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు

Mar 17 2026 8:25 AM | Updated on Mar 17 2026 5:06 PM

Top 10 Bank Defaulters Owe Rs 40635 Cr Nirmala Sitharaman Reveals Action Plan

మొత్తంగా రూ.40,635 కోట్లు

జాబితాలో ఏబీజీ షిప్‌యార్డ్, గీతాంజలి జెమ్స్, హెచ్‌డీఐఎల్‌

లోక్‌సభకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ వెల్లడి

దేశంలో బ్యాంకులకు టాప్‌–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ జాబితాలో ఏబీజీ షిప్‌యార్డ్‌ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్‌ (రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్‌ (రూ.5,268 కోట్లు), రాకేష్‌ కుమార్‌ కుల్దీప్‌ సింగ్‌ వాధ్వాన్‌ (రూ.4,291 కోట్లు) ఉన్నట్లు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆమె వెల్లడించారు. 

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, బడా ఎగవేతదారుల (డిఫాల్టర్ల)పై చర్యలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు ఈ మొత్తం జాబితాను అన్ని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ (సీఐసీ)లకు నెలవారీగా సమర్పించాల్సి ఉంటుందని, అలాగే ఆయా సీఐసీలు దీన్ని తమ వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని కూడా ఆమె వివరించారు.

సెటిల్మెంట్‌ చేసుకోవచ్చు కానీ...

ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేటగిరీలో చేర్చిన ఖాతాలకు సంబంధించి బ్యాంకులు రాజీ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని, అయితే ఆయా రుణగ్రహీతలపై కొనసాగుతున్న నేర విచారణలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని సీతారామన్‌ పేర్కొన్నారు. డిఫాల్ట్‌ సొమ్మును తీవ్రమైన జాప్యాలు లేకుండా రికవరీ చేసుకోవడంలో రుణదాతలకు వెసులుబాటు కల్పించడమే దీని ఉద్దేశమని చెప్పారు.

డిజిటల్‌ పేమెంట్స్‌ జోరు..

గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్‌ పేమెంట్‌ లావాదేవీలు అసాధారణరీతిలో ఎగబాకాయని, దీనికి ప్రధానంగా ప్రభుత్వం, ఆర్‌బీఐ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సమన్వయంతో చేపట్టిన చర్యలే కారణమని మరో ప్రశ్నకు సమాధానంగా సీతారామన్‌ బదులిచ్చారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల విలువ రూ.457.44 లక్షల కోట్లు కాగా, 2024–25 నాటికి ఇది రూ.849.12 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని ఆమె చెప్పారు. వీటిలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) 81 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ రిటైల్‌ పేమెంట్‌ వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

డిజిటల్‌ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ పలు చర్యలు చేపడుతున్నాయన్నారు. కస్టమర్‌ మొబైల్‌ నంబర్, పరికరం మధ్య అనుసంధానం, పిన్‌ ద్వారా రెండంచెల ధృవీకరణ, రోజువారీ లావాదేవీల పరిమితి, ఇంకా కొన్ని రకాల వినియోగాలపై నియంత్రణలు ఇందులో ఉన్నాయని వివరించారు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో అలెర్ట్‌లు పంపడం, వాటిని తిరస్కరించడానికి బ్యాంకులన్నింటికీ ఏఐ/ఎంఎల్‌ ఆధారిత ఫ్రాడ్‌–మానిటరింగ్‌ పరిష్కారాన్ని ఎన్‌పీసీఐ అందిస్తోందని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.

11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్‌

గత 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్‌) చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. 2019–20లో గరిష్టంగా రూ.1.59 లక్షల కోట్లను రైటాఫ్‌ చేయగా... 2024–25లో ఈ మొత్తం రూ.47,568 కోట్లకు దిగొచ్చిందని లోక్‌సభకు ఇచి్చన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. ‘ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం, నాలుగేళ్లపాటు పూర్తి ప్రొవిజనింగ్‌ (కేటాయింపులు) జరిపిన మొండి బకాయిల (ఎన్‌పీఏ)తో సహా, ఎన్‌పీఏలను బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయి.

ఈ చర్యల వల్ల రుణగ్రహీతలు చెల్లించాల్సిన అప్పులు మాఫీ కావు, అందువల్ల ఇది వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. రుణగ్రహీతలు బకాయిల చెల్లింపును కొనసాగించాల్సిందే. ఆయా ఖాతాలపై బ్యాంకులు చేపట్టిన రికవరీ చర్యలు కూడా కొనసాగుతుతాయి’ అని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement