వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ స్థిరమైన, నమ్మకమైన వాతావరణం కలి్పస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ), ఐరోపా, యూకే, యూఎస్‌తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావించారు. నార్వే పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్ ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఇన్వెస్టర్లతో ఓస్లోలో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై ఈ సందర్భంగా సానుకూల చర్చలు జరిగినట్టు మంత్రి చెప్పారు.
పౌరులు, కంపెనీలకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే దిశగా 2026–27 బడ్జెట్‌లో సంస్కరణలపై దృష్టి పెట్టినట్టు గుర్తు చేశారు. విధానాల్లో స్పష్టత, స్థూల ఆర్థిక వాతావరణం, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను ఈ సందర్భంగా అక్కడి సీఈవోలు, ఇన్వెస్టర్లు అభినందించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొంది. భారత్‌లో సంస్కరణలు, వృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇన్వెస్టర్లకు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) సీఈవో తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్ నార్వే ప్రధాని జోనాస్ గార్‌స్టోర్‌తోనూ భేటీ అయ్యారు. భారత ప్రధాని మోదీ నార్వే పర్యటన (ఈ ఏడాది చివర్లో) కోసం వేచి చూస్తున్నామని.. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సహకారం మరింత విస్తృతమవుతుందన్న ఆశాభావాన్ని జోనాస్ వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్!


