రాహుల్ వ్యాఖ్యలపై నిర్మల ధ్వజం
బడ్జెట్‌పై చర్చకు మంత్రి సమాధానం
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్‌కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్‌దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్‌సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్‌లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు.
రాహుల్ అసలు బడ్జెట్‌నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.
బెంగాల్లో బాంబుల రాజ్యం!
కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్‌కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు.
దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు.
అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్‌కు అలవాటుగా మారిందన్నారు.


