న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్‌తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు.


