అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విదేశీ సిబ్బందిని అమెరికాకు పిలిపించుకునే బదులు ప్రతిభ ఉన్న చోటికే తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో గూగుల్ భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది.
బెంగళూరులో భారీ క్యాంపస్
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు టవర్లలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉండబోతోందని ప్రాథమిక సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 20,000 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. భారత్‌లో ప్రస్తుతం గూగుల్‌కు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్‌తో గూగుల్ ఇండియా తన సిబ్బంది సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. 6.5 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. మిగిలిన రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతాయని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.
వీసా ఆంక్షలే వరంగా..
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న మార్పులు భారతీయ ఇంజినీర్లకు వరంగా మారాయి. యూఎస్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు కంపెనీలు దాదాపు 1,00,000 డాలర్లు (సుమారు రూ.91 లక్షలు) వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీసా అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే భారత్‌లోనే స్థానిక బృందాలను నిర్మించడం కంపెనీలకు లాభదాయకంగా మారుతుంది. మానవ వనరులను అమెరికాకు తరలించే ఖర్చు తగ్గడమే కాకుండా, భారతీయ నైపుణ్యాన్ని తక్కువ వ్యయంతోనే వినియోగించుకునే వీలు కలుగుతోంది.
ఏఐ రేసులో భారతే కీలకం
ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన విభాగాల్లో వందలాది పోస్టుల కోసం గూగుల్ నియామకాలు చేపడుతోంది. గూగుల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి సంస్థలు కూడా భారత్‌లో తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ దిగ్గజ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరగడం గమనార్హం. ఇది గత మూడేళ్లలో అత్యధిక వృద్ధి.
ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..


