(కర్ణాటక) దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపుర తాలూకాలో ఖతర్నాక్ కిలేడీ లీలలు వెలుగు చూశాయి. వివాహమై పిల్లలు ఉన్నా మరో ఇద్దరు వ్యక్తులను మోసం చేసి వివాహం చేసుకుని రూ.లక్షల్లో డబ్బు దోచుకున్నారు. ఈ కిలేడీ బాగోతాన్ని మోసపోయిన భర్తలు బయటపెట్టారు. దొడ్డ తాలూకాలోని హణబె గ్రామానికి చెందిన సుధారాణిపై ఈమేరకు ఆరోపణలు వచ్చాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. వీరేగౌడ అనే వ్యక్తిని సుధారాణి మొదటి వివాహం చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భర్తతో సంతృప్తి చెందని సుధారాణి అతడికి బుల్లెట్, కారు లేదని అసలు నడపడమే రాదనే సాకులు చెప్పి గొడవపడి పిల్లలను, భర్తను వదిలి చేతికందినంత డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోయింది. తరువాత డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అనంతమూర్తి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తనకు భర్త లేడని, చనిపోయాడని, ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పుకుంది. తరువాత మాయ మాటలు చెప్పి అనంతమూర్తిని ఒక గుడిలో వివాహం చేసుకుని 18 నెలలు సంసారం చేసింది.
ఈ ఏడాదిన్నర కాలంలో పలు కారణాలు చెప్పి అనంతమూర్తి వద్ద రూ.20 లక్షల వరకూ నగదు తీసుకుంది. డబ్బులు తీసుకున్నాక సుధారాణి అనంతమూర్తిని వదిలి కనకపురకు చెందిన మరో డబ్బున్న వ్యక్తిని ట్రాప్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త వీరేగౌడ, రెండవ భర్త అనంతమూర్తి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులను మోసం చేసి వివాహం చేసుకున్నట్టు నాటకమాడి తరువాత వారి నుంచి డబ్బులు గుంజి వదిలేస్తున్న సుధారాణిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


