సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది. నేడు (ఆదివారం) రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథసప్తమి (సూర్య జయంతి) రోజున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేయనుండటంతో, ఆ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి అధిక సమయం పడుతోందని సమాచారం. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆహార పానీయాలను అందిస్తున్నారు.

వైభవంగా ఏడు వాహనాల సేవలు
నేటి రథసప్తమి మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్ప స్వామి వారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ, భక్తులను అనుగ్రహించనున్నారు.



