నెయ్యిలో నిలువుదోపిడీ!
హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీ కోసం చంద్రబాబు ప్రభుత్వ కుట్ర
టీటీడీ నెయ్యి కాంట్రాక్టులో ఇందాపూర్ వాటా రూటు బట్టబయలు..
నందిని డెయిరీని అడ్డంపెట్టుకుని కథ నడిపిన బాబు సర్కార్
నెయ్యి ధర కిలో రూ.495 నుంచి 716.92కు పెంచారు..
పెంచిన రేట్లతో ఎల్–1 నందిని డెయిరీకి 20 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు
తర్వాత 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని నందినితో చెప్పించారు..
మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ‘ఇందాపూర్’ డెయిరీకే
ఇందాపూర్ కోసం ప్రత్యేకంగా రెండు తీర్మానాలు చేసిన టీటీడీ
ఆ తీర్మానాల ద్వారా ఇందాపూర్‌కు10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టులు
33% అధిక ధరతో రూ.65.48 కోట్ల మేర కాంట్రాక్టులు ఖరారు
సొంత డెయిరీ కోసం చంద్రబాబు హైడ్రామా
ప్రజలను తప్పుదారి పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదు అన్నది సామెత... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఎల్–1గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్‌కు అడ్డదారిలో టెండర్లు దక్కుతుండడం ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకొకటి బయటపడుతున్నాయి.
ఇందాపూర్, ఇంకా హెరిటేజ్ అనుకూల డెయిరీలు మాత్రమే టీటీడీ టెండర్లలోపాల్గొనేలా.. అసలు నెయ్యి టెండర్లంటేనే ఇతర డెయిరీలు భయపడేలా చంద్రబాబు అండ్ కో కల్తీ దు్రష్పచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లలో ఎల్–1గా వచి్చన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ)ని అడ్డంపెట్టుకుని ఇందాపూర్ డెయిరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది...
కిలో నెయ్యి ధర రూ.495 నుంచి రూ.716.92కు పెంచారు..
టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరిట దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడవచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం... టీటీడీ పాలకమండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు.
» 2024 నవంబరులో కిలో నెయ్యి రూ.495 చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదించింది.
» రెండు నెలల్లోనే... అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను రూ.513కు పెంచింది.
» 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో రూ.600గా ఖరారు చేసింది.
» అంతటితో ఆగలేదు... 2025 అక్టోబరులో కిలో నెయ్యి ధరను రూ.716.92కు పెంచింది.
» దాదాపు ఏడాదిలోనే కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83 శాతం పెరిగిందన్నమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుతూ పోయారు? దీని వెనక ఉన్న మతలబేమిటి?
సంప్రదింపులకు యత్నించకుండానే ఏకపక్షంగా...
నందిని డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని భారీ ధరలకు టెండరు కోట్‌చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచుతూ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వంగానీ, టీటీడీగానీ ఇతర డెయిరీలతో సంప్రదింపులు జరపాలి. ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబరులో ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్‌లో నెయ్యి కిలో రూ.529కి విక్రయిస్తోంది.
ఇక ఏపీలోని సహకార రంగ విజయ డెయిరీ కిలో రూ.675కు, తెలంగాణలోని సహకార రంగంలోని టీజీ విజయ డెయిరీ కిలో రూ.637 చొప్పునే రిటైల్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. రీటైల్ మార్కెట్‌లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ చార్జీలతోపాటు ఏజెన్సీకి లాభం(కమీషన్) అదనంగా భరించాల్సి ఉంటుంది.
అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వ్యయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దానిని చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోలేదు. వివిధ డెయిరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం, టీటీడీ విస్మరించాయి. ఏకపక్షంగా కిలో రూ.716.92లు చొప్పుననెయ్యికాంట్రాక్టు ఖరారు చేసేశారు.
నందిని, ఇందాపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ...
నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండరు ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచి్చంది. ముందుగా 2025 అక్టోబర్‌లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఎల్–1గా వచ్చిన నందిని డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారు. అదీ కిలో రూ.716.92లు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానం ఆమోదించిన తర్వాత.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డెయిరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది.
తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఆ విధంగా నందిని డెయిరీతో చెప్పించారన్నది బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేని సంస్థ అసలు టెండర్లలో ఎందుకు పాల్గొంటుంది? అంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే నందిని డెయిరీ ఆ ప్రకటన చేసిందన్నది స్పష్టమవుతోంది. ఆ తర్వాత నందినీ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు.
మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల్లో సవరణలు చేసి 2025 డిసెంబర్‌లో పది లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రెండు వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారయ్యేలా ఇతర డెయిరీలనూ మేనేజ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులను ఖరారు చేస్తూ టీటీడీ పాలకమండలి ప్రత్యేకంగా రెండు తీర్మానాల (590 తీర్మానం, 605 తీర్మానం) ద్వారా కథ నడిపింది. అవి ఇలా ఉన్నాయి...
» టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డెయిరీకి 65 శాతం వాటాతో... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 35 శాతం వాటా... అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కేటాయించారు.
» ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్‌కు 35 శాతం వాటా.. అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 65 శాతం వాటా... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కేటాయించారు.
ధర మాటున మతలబు
ఇందాపూర్ డెయిరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. మరీ కిలో రూ.716.92 అంటే బాగుండదు అనుకున్నారో ఏమో.. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 6.50 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి రూ.649 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 3.50 లక్షల కిలోల నెయ్యి టెండరు కట్టబెట్టారు.
ఇలా మొత్తంగా రూ.65.48 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టారు. అంటే ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేందుకే పక్కా పన్నాగంతోనే ఈ కథంతా నడిపారని, నందిని డెయిరీకి నష్టం లేకుండా.. కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచారన్నది బట్టబయలైంది. ఇక ఇందాపూర్ డెయిరీకి ఖరారు చేసిన ధరలను ఏడాది క్రితం టీటీడీ నెయ్యి ధరతో పోలిస్తే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం బయటపడుతోంది.
ఏకంగా 33 శాతం అధిక ధరకు ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారన్నది తేటతెల్లమవుతోంది. అందుకు సహకరించిన నందినీ డెయిరీకి కూడా రూ.76.19 కోట్ల కాంట్రాక్టు ఖరారు చేశారు. వెరసి దొంగలు దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్టుగా... నందిని డెయిరీ, ఇందాపూర్ డెయిరీ కలిపి తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొట్టాయన్నది స్పష్టమైంది.

చేతులెత్తేసి... మళ్లీ టెండర్లలో పాల్గొన్న ‘నందిని’...
ఇక తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం టీటీడీ సవరణ టెండర్ల వ్యవహారంలో బట్టబయలైంది. మొదట 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో పాల్గొన్న నందిని డెయిరీ... తీరా టెండరు ఖరారు అయ్యాక (ముందుగా వేసుకున్న పథకం ప్రకారం) తాము 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ డెయిరీని కిలో రూ.716 చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టుకే పరిమితం చేశారు.
తద్వారా ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం టీటీడీ 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున రెండు వేర్వేరు అంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం సవరణ టెండర్లు పిలిచింది. వాటిలో టీటీడీ 605 తీర్మానం ద్వారా ఆమోదించిన ఒక టెండరులో నందిని డెయిరీ కూడా పాల్గొనడం గమనార్హం. అంటే 10 లక్షల కిలోల కంటే ఎక్కువ సరఫరా చేయలేమని 2025 అక్టోబరులో పక్కకు తప్పుకొన్న నందినీ డెయిరీ... ఆ వెంటనే.. అంటే 2025 నవంబరులోనే పిలిచిన టెండర్లలో మరో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగలమని బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది.

అంటే 2025 సెప్టెంబరులో పిలిచిన టెండర్లలో కూడా 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం నందిని డెయిరీకి ఉందనేది స్పష్టమైంది. కేవలం ఇందాపూర్ డెయిరీ కోసమే ఆ రోజు 10 లక్షల కిలోల నెయ్యి టెండరు నుంచి నందిని పక్కకు తప్పుకొంది. మళ్లీ 2025 డిసెంబర్‌లో పిలిచిన సవరణ టెండర్లలో కిలో నెయ్యి రూ.716 చొప్పున బిడ్ దాఖలు చేసింది. అంటే ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.658 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసేందుకే ఆ విధంగా అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. ఆ విధంగా చంద్రబాబు ముఠా ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా టెండరు ఖరారు చేసేందుకు పక్కాగా కథ నడపిందన్నది స్పష్టమవుతోంది.






