సీనరేజ్‌ భారీగా పెంచిన ప్రభుత్వం | The government has significantly increased quarry Cinerege | Sakshi
Sakshi News home page

సీనరేజ్‌ భారీగా పెంచిన ప్రభుత్వం

Mar 9 2026 5:50 AM | Updated on Mar 9 2026 5:50 AM

The government has significantly increased quarry Cinerege

ఖనిజంపై వీర బాదుడు!

ఒక క్యూబిక్‌ మీటర్‌కు రూ.60 పెంపు 

రోడ్డు మెటల్‌ గతంలో రూ.90.. ప్రస్తుతం రూ.150 

గ్రానైట్‌పై సైతం టన్నుపై రూ.240 నుంచి రూ.500 వరకు పెంపు 

లబోదిబోమంటున్న క్వారీ నిర్వాహకులు 

అనంతపురం టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలపై వివిధ రకాలుగా భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే రెండుమార్లు భూముల ధరలను పెంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పాతాళంలోకి నెట్టేసింది. విద్యుత్‌ వినియోగదారులపై సైతం డెవలప్‌మెంట్‌ చార్జీల పేరిట వేల రూపాయల భారం మోపింది. తాజాగా ఖనిజ రవాణాపై సీనరేజ్‌ ధరలను అమాంతం పెంచేసింది. 

గతంతో పోలిస్తే 50 శాతం మేర సీనరేజ్‌ను పెంచింది. దీంతో క్వారీ నిర్వాహకులతో పాటు రోడ్డు మెటల్‌ కొనుగోలుదారులపై అదనపు సీనరేజ్‌ భారం పడనుంది. గత ప్రభుత్వంలో ఒక క్యూబిక్‌ మీటర్‌ రోడ్డు మెటల్‌ తవ్వి తరలిస్తే రూ.90 మేర సీనరేజ్‌ చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం రూ.150కి పెంచింది.  

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 146 రోడ్డు మెటల్‌ క్వారీల్లో 120కిపైగా రన్నింగ్‌లో ఉన్నాయి. రోజువారీగా వేల క్యూబిక్‌ మీటర్ల రోడ్డు మెటల్‌ తవ్వకాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన ధరల మేరకు క్వారీ నిర్వాహకులు సీనరేజ్‌ను చెల్లిస్తున్నారు.  గ్రానైట్‌పై సైతం సీనరేజ్‌ను పెంచేశారు. గ్రానైట్‌ రకాన్ని బట్టి కలర్, బ్లాక్, గెలాక్సీ తదితర రకాలపై రూ.240 నుంచి రూ.500 వరకు క్యూబిక్‌ మీటర్‌పై పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా 193 గ్రానైట్‌ క్వారీల్లో ప్రస్తుతం 100కు పైగా నడుస్తున్నాయి. 

పెరగనున్న రోడ్డు మెటల్‌ ధరలు 
సీనరేజ్‌ పెరగడంతో రోడ్డు మెటల్‌ ధరలను సైతం క్వారీ నిర్వాహకులు పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 40 ఎంఎం మెటల్‌ ఒక యూనిట్‌కు రూ.2,500లు,  20 ఎంఎం యూనిట్‌కు రూ.3 వేల చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నారు. సీనరేజ్‌ పెంపుతో రోడ్డు మెటల్‌ ధరలను సైతం  పెంచేందుకు క్వారీ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. క్వారీ నిర్వాహకుల అసోసియేషన్‌ సమావేశం నిర్వహించి.. ఎంతమేర పెంచాలో నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో పెంచనున్నట్లు సమాచారం. రోడ్డు మెటల్‌ ధరలు పెరిగితే భవన నిర్మాణ యజమానులు, రోడ్డు కాంట్రాక్టర్లు,   బిల్డర్లపై అదనపు భారం పడనుంది.

సీనరేజ్‌ పెరిగింది  
ఖనిజాలపై సీనరేజ్‌ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన మాట వాస్తవమే. పెంచిన సీనరేజ్‌ ధరలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. రోడ్డు మెటల్‌పై క్యూబిక్‌ మీటర్‌కు రూ.60 మేర పెంపు చేశారు. ప్రస్తుతం క్యూబిక్‌ మీటర్‌ ధర రూ.150 మేర ఉంది. గ్రానైట్‌పై సైతం స్వల్పంగా పెంచారు. గ్రానైట్‌ సైజులను బట్టి సీనరేజ్‌ ధరలు పెరగనున్నాయి.   – ఆదినారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement