నేడు ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘పరిష్కార వేదిక’

Mar 9 2026 7:24 AM | Updated on Mar 9 2026 7:24 AM

అనంతపురం అర్బన్‌ : కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. భూసమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్‌లో తహసీల్దార్లకు అర్జీలు సమర్పించాలని సూచించారు. కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ పంపవచ్చన్నారు.

నేడు డయల్‌ యువర్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్‌ యువర్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు 91547 90350, 08554 272943 నంబర్‌లో సంప్రదించాలన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు.

స్కూళ్లలో ‘వాటర్‌ బెల్‌’

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి గంటకూ ఒకసారి తాగునీరు అందించే ‘వాటర్‌ బెల్‌’ విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో శారీరక కార్యకలాపాలు నిర్వహించవద్దని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం సమృద్ధిగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంతో పాటు మజ్జిగ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హీట్‌ స్ట్రోక్‌ లక్షణాలు కనిపించిన విద్యార్థులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108 సేవలకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం టౌన్‌: పరిశ్రమలు నెలకొల్పే ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తల నుంచి స్థలాల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నాగకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కావాల్సిన పారిశ్రామిక వేత్తలు తమ డీపీఆర్‌ ప్రాజెక్టు నివేదికతో ఏపీఐఐజీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెంటనే వాటిని పరిశీలించి సకాలంలో స్థలాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలోని సిరికల్చర్‌ కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందులో సైతం షాప్‌లను ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలకు అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు భూమి విలువపై 75 శాతం మేర ప్రభుత్వం రాయితీలను అందిస్తోందన్నారు. www.apiic.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరిన్ని వివరాలకు ఏపీఐఐజీ మేనేజర్‌ సెల్‌: 9666330666 ను సంప్రదించాలన్నారు.

అప్పు చెల్లించలేదని

చెంప కొరికాడు!

బొమ్మనహాళ్‌: అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో చెంపపై కొరికి గాయపరిచిన సంఘటన గోవిందవాడలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు... శశిధర్‌ అనే వ్యక్తి గ్రామానికి చెందిన రాజన్నతో రెండేళ్ల క్రితం రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగివ్వాలని రాజన్న శనివారం సాయంత్రం అడిగాడు. ఉగాది తర్వాత ఇస్తానని శశిధర్‌ చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. రాజన్న కోపంలో శశిధర్‌ చెంపపై కొరకడంతో తీవ్ర గాయమైంది. బళ్లారి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన శశిధర్‌ ఆదివారం బొమ్మనహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement