అండగా నిలవనున్న జీడిమామిడి పరిశోధన సంస్థ
మన్యం ఉత్పత్తులకు ఇక ఆర్గానిక్ బ్రాండ్
త్రిచూర్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయాలు
మన్యంలో పంట విస్తీర్ణానికి ప్రోత్సాహం
రంపచోడవరం: ఏజెన్సీలో జీడిమామిడి పంట విస్తీర్ణం పెంచేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఏటా జీడిమామిడి పిక్కలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుండడంతో ఈ పంట తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొక్కలు నాటి వాటి విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కేరళ రాష్ట్రం త్రిచూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ అంశంపై జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు.
అల్లూరి జిల్లాలో జీడిమామిడి పంటను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పీసీ వెంగయ్య వివరించారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతంలో జీడిమామిడి అభివృద్ధికి గిరిజనులకు ఉచితంగా మొక్కల పంపిణీ, పాత తోటల స్థానంలో అంటు మొక్కలు వేయించడం, వాటికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిచడం వంటి విషయాలపై ప్రణాళికలు రూపొందించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహం
జీడిమామిడి ఉత్పత్తులకు పరిశ్రమలను ప్రోత్సహించడం, జీడిమామిడి పండు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, జీడిమామిడి తోటల పెంపకం, చీడ పీడల నుంచి రక్షణకు శిక్షణ ఇవ్వడం, జీడిపప్పు, జీడిపండు ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం, సబ్సిడీ ఇవ్వడం, ఏజెన్సీలోని ఉత్పత్తులకు ఆర్గానిక్ బ్రాండ్ కల్పించడం తదితర చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు కొచ్చిలోని జీడి మామడి అభివృద్ధి సంస్థకు అవకాశం కల్పించారు.
పండ్లతో అనేక ఉత్పత్తులు..
జీడిమామిడి పండ్లతో జెల్లీ, వైన్, పచ్చళ్ల వంటి అనేక రకాలైన ఆహార పదార్థాలు తయారు చేయవచ్చు. జీడిమామిడి పండులో విలువైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పండ్లతో పోల్చితే నాలుగు రేట్లు అధికంగా ఉంటుంది. ఐరన్, మాంస కృత్తులు 0.15 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం, పీచు పదార్థాలు 0.5 నుంచి 1 శాతం ఉంటాయి. జీడిమామిడి పండ్లు తీయగా ఉన్నçప్పటికీ నేరుగా తింటే పినాలిక్స్ వల్ల గొంతులో కీచు ఏర్పడుతుంది. దీనిని అధిగమించి విలువ అధారిత ఉత్పత్తుల తయారీకి ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు చర్యలు చేపడుతున్నారు.
ఏటా 40 లక్షల టన్నులు వృధా
జీడిగింజ ఉత్పత్తికి మాత్రమే జీడిమామిడి పంట సాగు చేస్తున్నారు. జీడిగింజ కంటే 8 నుంచి 10 రెట్లు పరిమాణంలో ఉన్న ఆ పండు మాత్రం వృథాగా తోటల్లో మిగిలిపోతోంది. ఏటా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృ«థా అవుతున్నాయి. జీడిమామిడి పండులో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. పండు రసంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, మాల్టోజ్, మాలిక్ ఆమ్లం ఉంటాయి.
తోటల అభివృద్ధికి కృషి
జిల్లాలో 50 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగులో ఉంది. ఈ విస్తీర్ణం మరింత పెంచేందుకు ఇటీవల కేరళలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇందు కోసం పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించనున్నారు. జీడిమామిడి పిక్కల కంటే ఆ పండ్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది. కాని వాటి వల్ల ఇప్పటి వరకు ఇక్కడ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. చెట్ల నుంచి పిక్కలను సేకరించి పండ్లను వదిలేయడంతో అవి వృథాగా పోతున్నాయి.
ఏజెన్సీలో రైతులు కేవలం పిక్కలను మార్కెట్ చేయడంపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ ఆ పిక్కల నుంచి పప్పు సేకరణకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేదు. జాతీయ స్థాయిలో జరిగిన సమావేశంలో రైతులు కొత్తగా జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం లభించనుంది. దేశంలో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జీడిమామిడి పంట ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ముందున్నాయి. తాజాగా జీడిమామిడి అభివృద్ధి సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఏజెన్సీ ప్రాంతంలో జీడిమామిడి అభివృద్ధికి బాటలు పడనున్నాయి.
గిరిజనుల ఆర్థిక ప్రగతికి
గిరిజనుల ఆర్థిక ప్రగతికి జీడిమామిడి పంటతో విలువ అధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తున్నాం. పిక్క నుంచి వచ్చే మొక్కల వల్ల దిగుబడి అంతగా రాదు. వాటి స్థానంలో అంటు మొక్కలను రైతులకు ఇస్తాం. జీడిమామిడి పంట ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఆర్థికంగా ఉపయోగ పడేలా కార్యచరణ, శిక్షణ ఇస్తాం. – పీసీ వెంగయ్య, హెచ్‌ఆర్‌ఎస్ అధిపతి, ఫుడ్ సైంటిస్ట్, పందిరిమామిడి


