వాహనాల్లో కానరాని రిఫ్లెక్టివ్ సేఫ్టీ విధానం
రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత
క్షతగాత్రులవుతున్న వేలాది మంది
పట్టించుకోని అధికారులు, ప్రభుత్వ పెద్దలు
తెలంగాణలో అమలు
ఉదయగిరి: రాష్ట్రంలో రోడ్డెక్కాలంటే భయంతో వణికిపోవాల్సి వస్తోంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. నిబంధనలను ప్రభుత్వం, రవాణా అధికారులు కచ్చితంగా అమలు చేయకపోవడంతో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది క్షత్రగాతులుగా మారుతున్నారు. కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణలో గత నెల 20 నుంచి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రాష్ట్రంలోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఇదీ పరిస్థితి..
రాష్ట్ర పరిధిలో మొత్తం 55 జాతీయ రహదారులు.. 8638.15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల్లో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళ, పొగమంచు కురిసే సమయాల్లో ముందున్న వాహనాలు అతి సమీపానికి వచ్చేంత వరకు కనిపించవు. దీంతో ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖల వివరాల మేరకు రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షత్రగాతుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చలి కాలంలో ముందున్న వాహనాలు కనిపించక రాష్ట్రంలో 1550 ప్రమాదాలు జరగ్గా, ఇందులో 700 మంది మృత్యవాత పడగా, మరో 1530 మంది గాయపడ్డారు.
స్పష్టమైన విధానాలేవీ..?
రిఫ్లెక్టివ్ టేపుల వినియోగంపై రాష్ట్రంలో నేటికీ స్పష్టమైన విధానమే లేదు. మరోవైపు నకిలీవి మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ప్రత్యేక విజిబిలిటీ చెకింగ్ డ్రైవ్‌లను రాత్రి వేళ చేపడుతున్న దాఖలాల్లేవు. ఇలా తిలాపాపం తలా పిడికెడు అనే రీతిలో ప్రభుత్వం.. అధికారులు వ్యవహరిస్తుండటంతో యాక్సిడెంట్లు నిత్యకృత్యమవుతున్నాయి.
తెలంగాణలో అమలు..
తెలంగాణలో ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ఉన్న సరి్టఫైడ్ రిఫ్లెక్టివ్ టేపులను అమర్చాలి. ప్రభుత్వం ఎం ప్యానల్ చేసిన వాటిని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవి లేకపోతే ఫిట్‌నెస్ పత్రాన్ని జారీ చేయరు. రాత్రి వేళ విజిబిలిటీ చెకింగ్, కఠినమైన జరిమానాలను విధిస్తున్నారు. గత నెల 20న ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పద్ధతికి ఇక్కడా శ్రీకారం చుట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
చట్టం అమల్లో నిర్లక్ష్యం
కేంద్ర మోటార్ వాహనాల చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన మేరకు యజమానులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులను విధిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కాంతివంతమైన లైట్లనూ బిగించుకోవాలి. అయితే రాష్ట్రంలో ఇవి అమలుకు నోచుకోవడంలేదు.
ఫలితంగా నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చలికాలంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండి, ముందున్న వాహనాలు సమీపానికి వచ్చేంత వరకు డ్రైవర్లకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై నిలిపిన లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు తదితరాలకు ఈ టేపుల్లేకపోవడంతో ప్రమాదాలు రాత్రి వేళ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక వేళ వినియోగించినా, నాణ్యమైన టేపులు కాకపోవడం సైతం ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది.


