వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒక్కొక్క సచివాలయంలో పది నుంచి పన్నెండు మందిని వివిధ విభాగాల కింద ఉద్యోగులుగా నియమించారు. ఇందులో భాగంగా విలేజ్ సర్వేయర్లను నియమించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను చీలకలు పీలికలు చేశారు. రెండు.. మూడింటిని విలీనం చేస్తూ.. ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. తాజాగా విలేజ్ సర్వేయర్ల విభాగ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసేలా సర్కార్ నిర్దయగా వ్యవహరిస్తోంది.
నెల్లూరు సిటీ : కూటమి సర్కారు విలేజ్ సర్వేయర్ల పాలిట సంకటంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. శతాబ్దం క్రితం ఏర్పాటు చేసిన సర్వే రాళ్లు, హద్దుల విషయంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు అప్పటికే అమల్లోకి తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలోకి విలేజ్ సర్వేయర్లను నియమించారు. రీసర్వే ప్రక్రియకు ఉపక్రమించారు.
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమిలా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజలకు విస్తృతంగా, వేగంగా సేవలందించేందుకు ఒక్కో సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పో లీస్, ఏఎన్‌ఎం, విలేజ్ సర్వేయర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్‌తోపాటు పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో హార్టికల్చర్ అసిస్టెంట్లు, సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్లను నియమించారు. అదే సమయంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి అన్ని వివరాలను వీరితో సర్వే చేయించి, ఆ వివరాలు నమోదు చేసేందుకు ఆయా విభాగాలు పనిచేస్తూ వచ్చాయి. దీంతో పాటు కార్యాలయంతోపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాదరణ అందుకున్న సచివాలయ వ్యవస్థతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందనే దుగ్ధతో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. రెండు..మూడు సచివాలయాలను విలీనం చేసి నిర్వీర్యం చేశారు. అందులోని ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఉన్న ఇద్దరు ముగ్గురు ఉద్యోగులకు అలవికాని బాధ్యతలు అప్పగించి వేధింపులకు పాల్పడుతోంది.
విలేజ్ సర్వేయర్ల వ్యవస్థకు విధ్వంస రచన
జిల్లాలో మొత్తం 386 మంది విలేజ్ సర్వేయర్లు విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో విలేజ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విలేజ్ సర్వేయర్లపై వివిధ శాఖల పనులుంచి ఒత్తిడి చేశారు. దూర ప్రాంతాలకు డిప్యుటేషన్ పై పంపారు. ఇవన్నీ భరిస్తూనే ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పే రోల్ మార్పు చేయాలని విలేజ్ సర్వేయర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మిగతా అందరికీ రూ.30 వేల వరకు బేసిక్ పే ఉండగా, విలేజ్ సర్వేయర్లకు రూ.25,200 మాత్రమే బేసిక్ పే ఉందని, ఈ తారతమ్యాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమోషన్ చానల్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడంతో ఈ నెల ఐదు నుంచి విలేజ్ సర్వేయర్లు సహాయ నిరాకరణకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల అసోసియేషన్లో నాయకులు సుమారు 40 మందిని సస్పెండ్ చేసింది. జిల్లాలో విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపె సర్వేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు ధర్నా నిర్వహించారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుల సస్పెన్షన్
జిల్లాలోని సచివాలయ విలేజ్ సర్వేయర్ అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నించడమే వారు చేసిన తప్పు. బేసిక్ పే తక్కువగా ఉందని, సర్వేయర్లపై పని ఒత్తిడి ఉందని ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని విలేజ్ సర్వేయర్లుగా పనిచేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు బీద లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అస్మతుల్లాను సస్పెండ్ చేశారు.
భయం గుప్పెట్లో సర్వేయర్లు
ప్రభుత్వ ఏకపక్ష ధోరణి, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంపై సర్వేయర్లు, భయం గుప్పెట్లో ఉన్నారు. ప్రతి వ్యవస్ధలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోంది. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్షులనే సస్పెండ్ చేయడంతో ఇతర సర్వేయర్లు ముందుకొచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు. తమపై ఎక్కడ వేటు వేస్తారని భయపడుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించేది కాదని పలువురు వాపోతున్నారు.
హక్కుల కోసం
పోరాటమే తప్పనే రీతిలో..
తమ డిమాండ్లను
పరిష్కరించాలంటూ నిరసనలు
జిల్లాలో ఇద్దరు సచివాలయ
సర్వేయర్ల సస్పెన్షన్‌తో బెదిరింపులు
వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు
రీ సర్వేకు ఆటంకాలు


