పౌష్టికాహారం.. అంతంతమాత్రం
మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా?
నాయుడుపేట టౌన్: మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే వండి పెడతారా? అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి వంట నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. నాయుడుపేటలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలో పప్పు నీళ్లు నీళ్లుగా ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాయుడుపేట ఐసీడీఎస్ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు సూపర్‌వైజర్, సీడీపీఓకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీడీ వసంతభాయిని ఆదేశించారు.
తిరుపతి అర్బన్:కూటమి ప్రభుత్వం వచ్చాక పౌష్టికాహారానికి గండిపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తోంది. పాలకులు, సంబంధిత ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి క్రింది స్థాయి సిబ్బంది బలిపశువులు కావాల్సి వస్తోంది. ఇలాంటిదే ఏపీ ఫుడ్ కమిటీ సభ్యుల తనిఖీలో వెలుగుజూసింది. కానీ తప్పుచేసిన వారిని వదిలేసి.. క్రింది స్థాయి సిబ్బంది, అధికారులను శిక్షించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. మంగళవారం వడమాలపేట యానాది సెంటర్–2, బట్టికండ్రిగ అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో పది రోజులుగా చిన్న పిల్ల లు, బాలింతలు, గర్భిణులకు పాల సరఫరా కాలేదని గుర్తించారు. అంగన్‌వాడీ వర్కర్, సూపర్‌వైజర్‌కు, సీడీపీఓకు షోకా జ్ నోటీసులు జారీచేయాలని ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)ని ఆదేశించారు. వడమాలపేట జెడ్పీ బాలుర హైస్కూల్‌లో ఫేజ్–1కి సంబంధించి 324 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడం, ఫేజ్–2 గుడ్లు ఒక్కసారిగా సరఫరా చేయడంపై మండిపడ్డారు. అలాగే పాఠశాల హెచ్‌ఎం, జూనియర్ అసిస్టెంట్, ఎగ్‌వెండర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం రేణిగుంట మండలంలోని ఆర్.మల్లవరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఫేజ్–1లో 145 బ్లూకలర్ గుడ్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అంగన్‌వాడీ వర్కర్‌కు, సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు. నాయుడుపేట మండలంలోని తాలయాపాళెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఫేజ్–1లో 42 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడంతోపాటు 1,500 గ్రాములు ఉండాల్సిన ఎగ్‌ట్రే బరువు 1,352 గ్రాములు ఉండడంతో మండిపడ్డారు. అంగన్‌వాడీ వర్కర్‌తోపాటు ఎగ్ వెండర్‌కు నోటీసులు జారీ చేయాలని ఆయన వెంట సివిల్ సప్లై జిల్లా అధికారి శేషాచలం రాజు, జిల్లా మేనేజర్ బాలకృష్ణ వారితోపాటు ఉన్నారు.
వీళ్లకేంటి సంబంధం
సాధారణంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల కాంట్రాక్ట్ జిల్లాస్థాయిలో జరుగుతుంది. అ క్కడ టెండర్లు దక్కించుకున్న వారి కాంట్రాక్ట్‌ను కలెక్టర్ ఓకే చేస్తారు. ఆ తర్వాత పీడీ సంతకం చేయడం పరిపాటి. ఆపై సీడీపీఓకు హైరింగ్ వెహికల్ ఇచ్చి, పర్యవేక్షణ కోసం నెలకు రూ.30 వేల అద్దె కూడా మంజూరు చేస్తుంటారు. స దరు అధికారి ఆ ప్రాజెక్టు మొత్తం పర్యటించి గుడ్లు సైజు, పాలు సరఫరా తదితర వాటిని ఎప్పకటిప్పుడు నివేదించాలి. సెక్టార్ స్థాయిలో సూపర్ వైజర్లు పర్యవేక్షించాలి. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఎంఈఓ పర్యటించాలి. ఏదైనా లోపాలు జరిగితే ముందుగా వారికే నోటీసులు జారీ చేయాలి. కానీ ఫుడ్ కమిషన్ సభ్యుడు హెచ్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.


