● అధికారుల చొరవతోనే ఆక్రమణల పర్వం ● నాడు ప్రభుత్వ భూమి.. నేడు పట్టా భూమి | - | Sakshi
Sakshi News home page

● అధికారుల చొరవతోనే ఆక్రమణల పర్వం ● నాడు ప్రభుత్వ భూమి.. నేడు పట్టా భూమి

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

● అధికారుల చొరవతోనే ఆక్రమణల పర్వం ● నాడు ప్రభుత్వ భూమి.. నేడు పట్టా భూమి

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ఎలాంటిదైనా తమ ఖాతాలో వేసుకోవడానికి కొందరు బరితెగిస్తారు.. పొరంబోకు స్థలాలు.. కాలువలు.. వాగులు పోయే.. చివరకు చెరువు భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. పట్టణానికి సమీపంలోని చెరువు స్థల ఆక్రమణకు తెరలేపారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఖాతాలో కలుపుకున్నారు. ఇందుకు పలు శాఖల అధికారుల పాత్ర కూడా ఉందని స్థానికులు అంటున్నారు.

బోర్డు తొలగించి అక్రమార్కులు నాటిన పసుపురాళ్లు

సూళ్లూరుపేట: పట్టణంలోని సాయినగర్‌ ప్రాంతంలో ఎరబాళెం చెరువుకు సంబంఽధించిన సుమారు రూ.కోటి 58 అంకణాల భూమిని కొంతమంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పరోక్షంగా రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సహకారం కూడా ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సర్వే నంబర్‌ 21–1లో ఎరబాళెం చెరువుకి సంబంధించి సుమారు 58 అంకణాలు భూమి ఉంది. దీన్ని గతంలో కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు చేసినపుడు అప్పటి రెవెన్యూ అధికారులు స్పందించి, అడ్డుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఆ బోర్డు పీకిసి, సర్వే నంబర్లను 21–1ని 20–1గా మార్చేసి 58 అంకణాల్లో 32 అంకణాల భూమిని 2025 నవంబర్‌ 28న రిజిస్టర్‌ చేయించుకున్నారు. 2011లో అప్పటి తహసీల్దార్‌ జాలిరెడ్డి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. లింక్‌ డాక్యుమెంట్‌ లేకుండా నకిలీ డాక్యుమెంట్లతో 2025 నవంబర్‌ 14న మున్సిపల్‌ కార్యాలయంలో ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంతోపాటు ఖాళీ ఆస్తిపన్ను కూడా కట్టించుకుని, మున్సిపల్‌ అధికారులు అన్ని విధాలా సహకరించారు. వీటిని పొందుపరిచి ఈ స్థలాన్ని రిజిస్టర్‌ చేశారు. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ స్థలానికి ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్‌ లేకుండా అక్రమార్కులు ఇచ్చిన నకిలీ రికార్డులతో రిజిస్టర్‌ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో భారీ ఎత్తును ముడుపులు అధికారులకు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్‌ గోపీనాథ్‌రెడ్డిని వివరణ కోరగా ఈ సమస్య తన దృష్టిలో ఉందని, సాయినగర్‌కు చెందని వారు దీనిపై తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఇందులో తప్పులు దొర్లాయని, గతంలో పనిచేసిన తహసీల్దార్‌ చేసిన పొరపాటు కనిపిస్తోంది. పట్టా భూమికి పొజిషన్‌ ఎందుకు ఇచ్చారో! మా వీఆర్వో సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చిందో తెలుసుకుని దీనిపై పూర్తిస్థాయిలో సర్వే చేయించి తొందరలోనే తేలుస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement