శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

● 25 వాహనాలపై కేసులు ● రూ. 1.50 లక్షల జరిమానా

తిరుపతి క్రైం: తిరుమల ఘాట్‌ రోడ్డుకు ప్రవేశ ద్వారం అయిన అలి పిరి టోల్‌ గేట్‌ వద్ద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు రవాణాశాఖ అధికారులు, తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధిక శబ్దం చేసేలా మార్పులు చేసిన సైలెన్సర్లు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాలు, జీపులు, ఇతర రవాణా వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కొరప్రాటి మురళీమోహన్‌ మాట్లాడుతూ మోటార్‌ వాహన చట్టం 1988 ప్రకారం వాహనాల్లో అనుమతించిన డెసిబెల్స్‌ పరిమితిని మించిపోయేలా శబ్దం చేసే సైలెన్సర్లు ఉపయోగించడం నేరమని తెలిపారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్‌ 190(2) ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాహనచోదకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సీఐ హరిప్రసాద్‌ తెలిపారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో అధిక శబ్దం భక్తులు, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడంతోపాటు పర్యావరణానికి కూడా హానికరవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. తనిఖీల సమయంలో అనుమతించిన ప్రమాణాలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లు ఉన్న వాహనాలను గుర్తించి వాహనచోదకులకు అవగాహన కల్పించారు. అవసరమైన చోట్ల జరిమానాలు విధించారు. వాహనచోదకులు తమ వాహనాలను మోటారు వాహన చట్టం ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సౌకర్యం దృష్ట్యా వాహనచోదకులు అనుమతించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని, అనధికార సైరన్లు వినియోగించకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛందంగా వాహన నియమాలను పాటించి సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో మొత్తం 25 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 1.50 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో తిరుమల ట్రాఫిక్‌ సీఐ హరిప్రసాద్‌, మోటార్‌ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్‌ కుమార్‌, రమణ నాయక్‌, అతికానాజ్‌, స్వర్ణలత, ప్రసాద్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement