వెంకటగిరి రూరల్: మహాత్మగాంధీ ఉపాధిహామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై పీడీ శ్రీనివాసపస్రాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వల్లివేడు 9వ బెటాలియన్ వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం తనిఖీ చేశారు. పని వద్ద కూలీల హాజరు, పనులు నాణ్యత గురించి ఆరా తీశారు. వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాల విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కృష్ణయ్య, ఈసీ మునిశేఖర్, పీడీ సీసీ చంద్రశేఖర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ బుజ్జయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.
నిమ్మ రైతుల్లో ఆనందం
సైదాపురం: నిమ్మ ధరలు రోజురోజుకు ఊపందుకున్నాయి. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.110 నుంచి రూ.120 ధర పలుకుతున్నాయి. అయితే నాణ్యత కలిగిన కాయలు ధర రూ.120 వస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలో అధిక శాతం మంది రైతులు నిమ్మ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈక్రమంలో నిమ్మకాయల ధరలు క్రమీపీ పెరుగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా గూడూరు నిమ్మమార్కెట్‌లో లూజు (50 కిలో బస్తా) రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
గర్భిణులకు ఉచితంగా
అల్ట్రాసౌండ్ స్కానింగ్
తిరుపతి తుడా: స్విమ్స్ రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం గర్భిణులకు అల్ట్రాసౌండ్ (అబ్‌స్ట్రెటిక్) పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 15వ తేదీన షెడ్యూల్ ప్రకారం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీ ఆదివారం గర్భిణులకు ఉచిత స్కాన్ పరీక్షలను నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ స్కూటర్ దగ్ధం
వెంకటగిరి రూరల్: పట్టణంలోని క్రాస్‌రోడ్డు సమీపంలోని ఓ హార్డ్‌వేర్ షాపులో పార్కింగ్ చేసిన విద్యుత్ స్కూటర్ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నీరు పోసి మంటలు అదుపు చేశారు. వేసవి తాపానికి విద్యుత్ స్కూటర్ నుంచి మంటలు వ్యాపించి, పొగలు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.


