బంగారు డాలర్‌ ఎస్‌ఐకు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బంగారు డాలర్‌ ఎస్‌ఐకు అప్పగింత

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

● పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి ఆకస్మిక మృతి

నాయుడుపేట టౌన్‌: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మంగళవారం సాయంత్రం దొరికిన బంగారు డాలర్‌ ఉన్న సరుడును ఆర్టీసీ కంట్రోలర్‌ ఎం సుబ్రమణ్యంతోపాటు సూపర్‌వైజర్‌ సురేష్‌ కలిసి ఎస్‌ఐ భానుప్రసన్నకు అప్పగించారు. బస్టాండ్‌లో కిందపడి ఉన్న సరుడును ఆర్టీసీ కంట్రోలర్‌ గుర్తించారు. అయితే ఈ సరుడులో డాలర్‌ బంగారుదై ఉండడంతో దానిని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి ఎస్‌ఐకు అప్పగించినట్లు కంట్రోలర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లి వారి వివరాలను పోలీసులకు తెలిపి పోగొట్టుకున్న బంగారు డాలర్‌తోపాటు సరుడును తెచ్చుకోవచ్చన్నారు. డాలర్‌ను ఎస్‌కు అప్పగించిన ఆర్టీసీ కంట్రోలర్‌తో పాటు సూపర్‌వైజర్‌ను ఎస్‌ఐ అభినందించారు.

వరికోత యంత్రం బోల్తా

నాయుడుపేట టౌన్‌: మండలంలోని నరసారెడ్డికండ్రిగ జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌పై తీసుకువెళుతున్న వరికోత మిషన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. వరికోత మిషన్‌ను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతూ అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కడంతో ట్రాక్టర్‌తో పాటు వరికోత యంత్రం రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అటువైపు రాకపోకలు ఆగిపోయి, ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రోడ్డు మధ్యలో పడి ఉన్న వరికోత యంత్రాన్ని పక్కకు తొలిగించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో విషాదం

శ్రీకాళహస్తి: పట్టణంలోని ఎంజీ స్ట్రీట్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆకస్మికంగా స్పృహ తప్పి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంజీ స్ట్రీట్‌లో నివాసముంటున్న శ్రీనాథ్‌ పెయింటర్‌గా జీవనం గడుపుతున్నాడు. ఆయనకు సుజన, దీక్షిత అనే ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె సుజనకు అదే ప్రాంతానికి చెందిన శ్యామ్‌ప్రసాద్‌ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతుండడంతో సుజన పుట్టింటికే చేరింది. ఈ సమస్యపై పెద్దల సమక్షంలో రెండు, మూడు సార్లు పంచాయితీ కూడా జరిగినట్లు తెలిసింది. తాజాగా శ్యామ్‌ ప్రసాద్‌ మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండగా, శ్రీనాథ్‌ అడ్డం వెళ్లి వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనాథ్‌ తన అల్లుడిపై ఫిర్యాదు చేయడానికి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ఽధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులకు శ్రీనాథ్‌ మృతిపై ఎటువంటి పిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement