చోరీ కేసులో మహిళ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో మహిళ అరెస్టు

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

తిరుపతి రూరల్‌: బతుకుదెరువు కోసం తిరుపతి వచ్చి అద్దెకు దిగిన ఇంటి యజమాని ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన మహిళను తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్‌ సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం సాయినగర్‌లో నివాసముంటున్న వెంకటరెడ్డికి బయటకు వెళ్లే సమయంలో ఇంటి తాళం బయట పూలకుండీ వద్ద పెట్టి వెళుతుండడం అలవాటు. ఆ విషయం గమనించిన ఆ ఇంటి కింది అంతస్తులో అద్దెకు నివాసముంటున్న వి.సంధ్య సంజు ఆ తాళం తీసుకుని ఇంటిలోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేసి గుట్టుగా ఆ తాళం చెవిని మళ్లీ అక్కడే పెట్టింది. ఆ తరువాత కొంత ఆలస్యంగా గుర్తించిన ఇంటి యజమాని వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఇంట్లో అద్దెకు ఉన్న నిందితురాలు సంధ్య సంజుపై నిఘా పెట్టారు. పోలీసుల అనుమానం నిజం కావడంతో మంగళవారం ఆమె ఇంటిని తనిఖీ చేయగా పలు ఆభరణాలు బయటపడడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగలించిన ఆభరణాలలో కొన్నింటిని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటలో గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి రూ.1.40 లక్షలు నగదు పొందగా, మరో రెండు బంగారం ఉంగరాలను తన భర్త సురేష్‌ ద్వారా వి.కోటలోని ఓ కుదువ వ్యాపారి వద్ద కుదువ పెట్టినట్టు పోలీసులు తమ విచారణలో తేలింది. అనంతరం ఆమె నుంచి 50 గ్రాముల లాంగ్‌ చైన్‌, 44 గ్రాముల గుండ్లు లాంగ్‌ చైన్‌, 24 గ్రాములు నెక్లెస్‌, 11 గ్రాముల మూడు ఉంగరాలు, 2 గ్రాముల కమ్మలు మొత్తంగా 130 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్టు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement