గూగుల్ క్రోమ్, వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ ఎటాక్ (వాట్సాప్ టేక్‌ఓవర్)ను, క్రోమ్ ఎటాక్‌లు మొదలు పెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరించింది. క్రోమ్‌లో హానికరమైన, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత, బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్నట్టు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
అదేవిధంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయగానే సైబర్‌నేరగాళ్లు గోస్ట్ పేరింగ్ ఎటాక్‌కు తెరతీస్తున్నట్టు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్‌ను సైబర్‌నేరగాళ్లు వారి డివైజ్‌లో లింక్ చేస్తున్నట్టు తెలిపారు.
ఇలా వాట్సాప్ లింక్ అయిన తర్వాత మనకు వచ్చే.. మనం పంపే మెసేజ్‌లను, చాట్‌లను సీక్రెట్‌గా గమనిస్తూ మన నుంచి సమాచారం సేకరిస్తుంటారని చెప్పారు. అయితే గోస్ట్ ఎటాక్ జరిగినప్పటికీ మన వాట్సాప్ సాధారణంగానే పనిచేస్తుందని తెలిపారు. మీ వాట్సాప్ ఇతరులు లింక్ చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చేయకూడనివి..
» ఓటీపీ, పిన్, సీవీవీ లేదా వాట్సాప్ కోడ్‌లు ఎవరికీ ఎప్పుడూ షేర్ చేయొద్దు.
» ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్స్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
» తెలియని వెబ్‌సైట్‌లు లేదా పాప్–అప్‌లలో లాగిన్ కావొద్దు.
చేయాల్సినవి..
»వాట్సాప్ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయండి.
» ఏదైనా అనుమానాస్పదంగా డివైజ్‌లు లింక్ అయినట్టు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయండి.
» వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి.
» మీకు సంబంధించిన కీలక సమాచారం. ఫొటోలు, వీడియోలు వేరేచోట కాపీ చేసి పెట్టుకోండి.
» అనుమానాస్పద సందేశాలు, లింక్‌లు, పాప్–అప్‌ల స్క్రీన్‌షాట్‌లను తీసుకోండి.
» లావాదేవీ ఐడీలు, యూటీఆర్ నంబర్లు, కాల్ లాగ్‌లను సేవ్ చేయండి.
» గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్‌ను అప్‌డేట్ చేయండి.
» ఈ–మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.
» మీ బ్యాంక్‌లకు అనుమానాస్పద లావాదేవీల సమాచారం వెంటనే తెలియజేయండి.
» క్రోమ్, ఇతర యాప్‌లను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.


