మైనార్టీలకు 4 శాతం కోటా అమలుకు కృషి చేస్తా | Congress will protect 4 percent reservations for Muslims in Telangana: CM Revanth | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు 4 శాతం కోటా అమలుకు కృషి చేస్తా

Feb 6 2026 1:23 AM | Updated on Feb 6 2026 1:23 AM

Congress will protect 4 percent reservations for Muslims in Telangana: CM Revanth

ముస్లిం మత పెద్దల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

రాజేంద్రనగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి రాష్ట్రంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. నాలుగు శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు మైనార్టీ జనాభా లెక్కలను అందజేస్తామని చెప్పారు. మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజ ర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌ షా అంటున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని అమిత్‌షాకు సవాల్‌ విసిరాన న్నారు.

ఒక పార్టీ అవయవదానం చేయడంతో బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరిగిందన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో గురువారం తెలంగాణ జమాత్‌ ఉలేమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం మత పెద్దల సమావేశంలో రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీ, మెజార్టీ ప్రజలు కలిసి ముందుకెళ్లడానికి జమాత్‌ సంస్థ పాటుపడుతోందన్నారు.

‘మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు జమాత్‌ సంస్థ స్వచ్ఛందంగా సహకరించింది. నేను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి కూడా తోడ్పాటు అందించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటులో మైనార్టీల అండ కూడా ఉంది’ అని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసి మెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement