గ్రూప్‌–1 పారదర్శకమే.. | High Court CJ bench clarified Relief for candidates selected for Group-1 jobs | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 పారదర్శకమే..

Feb 6 2026 1:33 AM | Updated on Feb 6 2026 1:33 AM

High Court CJ bench clarified Relief for candidates selected for Group-1 jobs

హైకోర్టు సీజే ధర్మాసనం స్పష్టీకరణ.. గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) సక్రమంగానే పరీక్షలు నిర్వహించిందని చెబుతూ.. మెయిన్స్‌ జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనని సింగిల్‌ జడ్జి సెప్టెంబర్‌ 9న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పరీక్ష పారదర్శకంగానే జరిగిందని తేల్చిచెప్పింది. గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకత వకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. నిరూపితమైన వ్యవస్థాగత అక్రమాలు, చట్టఉల్లంఘన లేనప్పుడు మోడరేషన్‌తో తిరిగి మూల్యాంకనం చేయాలనే లేదా మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలనే ఉత్తర్వులు చెల్లవని చెప్పింది. 

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్ష పవిత్రతను ఊహా గానాలు, నిరాధారమైన ఆరోపణల ఆధారంగా అనుమానించలేమని స్పష్టం చేసింది. మూల్యాంకన పద్ధతిని విస్తృత ప్రజాప్రయోజనం కోసం ఏకరీతిలో వర్తింపజేసిన సందర్భంలో, ఏ అభ్యర్థిపైనా పక్షపాతం ఉండదని పేర్కొంది. కమిషన్‌తోపాటు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. సాంకేతిక నైపుణ్యం, అనుభవమున్న వారు రూపొందించిన అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యా విషయాలకు సంబంధించి తన సొంత అభిప్రాయాలను ప్రత్యామ్నాయం చేయడానికి కోర్టులు అయిష్టంగానైనా దూరంగా ఉండాలని అభిప్రాయపడింది. డివిజన్‌ బెంచ్‌ గురువారం అంశాల వారీగా తుది తీర్పు వెలువరించింది.

కేసు ఇదీ..
గత అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్‌ శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను రద్దు చేశారు. గ్రూప్‌–1 మెయిన్స్‌ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. దీన్ని సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ గౌస్‌ మీరా మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టి డిసెంబర్‌ 30న తీర్పు రిజర్వు చేసింది.

తీర్పు ఇలా...
1) పరీక్షా కేంద్రాలు: నిర్దిష్ట కేంద్రాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉందని రిట్‌ కోర్టు (సింగిల్‌ జడ్జి) గమనించింది. సెంటర్‌ 18(5.41%), సెంటర్‌ 19 (4.12%)తో పోలిస్తే ఇతర కేంద్రాల నుంచి ఎంపికైన మహిళా అభ్యర్థుల నిష్పత్తి చాలా తక్కువ ఉందని పేర్కొంది. అది వాస్తవం కాదు. కొన్ని కేంద్రాల్లో అంతకంటే ఎక్కువ శాతం (8వ కేంద్రంలో 6.25%, 12వ కేంద్రంలో 6.10%) అభ్యర్థులు ఎంపికయ్యారు. గణాంకాల నిర్ధారణ, ఆ కేంద్రాల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని అనుమానించడానికి ఆధారం కాజాలదు. ఆ కేంద్రాల్లో మోసం, కాపీయింగ్, కొందరికి అనుకూలంగా వ్యవహరించడం లాంటివి జరిగాయని ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కేంద్రాల వారీగా ఎంపిక నిష్పత్తిలో వ్యత్యాసం సహజమే. ఇలాంటి గణాంకాల ఆధారంగా పరీక్ష ప్రక్రియ పవిత్రతను అనుమానించలేం. ఈ విషయంలో రిట్‌ కోర్టు పొరపాటు పడింది.  

2) ఒకే మార్కులు: అనేక మందికి ఒకే మార్కులు (719) వచ్చాయని, ప్రత్యేకించి పక్కపక్క హాల్‌ టికెట్‌ నంబర్ల వారికి ఇలా జరిగిందని రిట్‌ కోర్టు పేర్కొంది. మెయిన్స్‌కు 21,110 మంది హాజరు కాగా.. 12,622 మంది అర్హత సాధించారు. పలువురు అభ్యర్థులకు ఒకేలా మార్కులు రావడం అసంభవం కాదు. పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరిగాయి. ఎలాంటి మోసాలు లేదా అవకతవకలు తేలలేదు. ఒకే మార్కులొస్తే స్థానిక హోదా, పుట్టిన తేదీ, పేపర్‌ 1 నుంచి 5 వరకు అధిక మార్కులు, ఆంగ్లంలో మార్కులు, ఉన్నత విద్యార్హత ఇలా పలు నిబంధనల మేరకు ఎంపిక చేశారు. అనుమానం, ఊహతో నియామక ప్రక్రియను తప్పుబట్టలేం. నియామక ప్రక్రియ అవకతవకలకు గురైందనే ఏ నిర్ధారణకూ ఆధారాల్లేవు.

3) తెలుగు మీడియం: ఆంగ్లం, తెలుగు సమాధాన పత్రాలకు ప్రత్యేక మూల్యాంకనదారులు లేరని రిట్‌ కోర్టు గమనించింది. అందుకే ఇంగ్లిష్‌తో పోలిస్తే తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ మొత్తంలో ఎంపికయ్యారనేది ఆరోపణ. అయితే, రాష్ట్రంలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు గ్రాడ్యుయేషన్‌ కోర్సు విద్యార్థులకు ఆంగ్లం, తెలుగు మీడియంలోనూ బోధిస్తారు. మెయిన్స్‌ పరీక్షను రెండు భాషల్లో మూల్యాంకనానికి వారు సమర్థులు. ఈ విషయంలో వాస్తవం కంటే ఊహపైనే రిట్‌ కోర్టు ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది.

4) మూల్యాంకనం: నియామకాల కోసం నిర్వహించే పరీక్షల మూల్యాంకనం ఏ పద్ధతిలో చేయాలో నిర్ణయించడానికి ఆర్టికల్‌ 320(3) ప్రకారం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు విస్తృత అధికారాలున్నాయి. మూల్యాంకన విధానంపై నోటిఫికేషన్‌లో నిర్దేశించిన నిబంధనల నుంచి కమిషన్‌ పక్కకు తప్పుకుందనే వాదన చట్ట ప్రకారం నిలబడదు. ప్రధాన పరీక్షకుల కమిటీ మొత్తం 351 మంది మూల్యాంకనదారులను గుర్తించి వారికి 90 రోజుల శిక్షణ నిచ్చింది. ఎంపిక ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు తేలితే, దాని పర్యవసానంగా జరిగినవన్నీ కూడా రద్దు చేయాలన్న వాదనను ఎంపిక కాని అభ్యర్థులు తెరపైకి తెచ్చారు. మొత్తం ఎంపిక ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసే వ్యవస్థాగత అవకతవకలు, మోసం ఉన్నట్లు తేలితేనే అది వర్తిస్తుంది. ఆధారాలు లేకుండా దాన్ని నిర్ధారణ చేయలేం. అవకతవకలకు సాక్ష్యాలు సమర్పించడంలో అభ్యర్థులు విఫలమైనందున న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement