పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఏకంగా 30,749 హెక్టార్ల భూమి
ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 157 పారిశ్రామిక పార్కుల్లో అందుబాటులో ఉన్న మొత్తం 32,033 హెక్టార్ల భూమిలో.. పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అలాగే మహారాష్ట్రలో 19,658 హెక్టార్లు, తమిళనాడులో 16,291 హెక్టార్లు, గుజరాత్‌లో 12,605 హెక్టార్లు భూమి అందుబాటులో ఉంది. ఈ మేరకు ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో ఆయా గణాంకాలను విడుదల చేసింది.
మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా అందులో 10,747 హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లు ఉండగా 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ‘ప్లగ్ అండ్ ప్లే’విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2025–26 బడ్జెట్‌లో దీనికోసం రూ. 2,500 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 306 ప్లగ్ అండ్ ప్లే పార్కులు ఉన్నాయి. మరో 20 పార్కులను నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది.
గ్రీన్ పార్కులకు గ్రీన్‌సిగ్నల్
పారిశ్రామిక పార్కుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఇండ్రస్టియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటలైజేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచి్చంది. 41 పార్కులు ‘లీడర్స్’గా, 90 పార్కులు ‘చాలెంజర్స్’గా నిలిచాయి. భారత్‌లో సులభతర వాణిజ్యం మెరుగుపడటంతో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. 2025 ఏప్రిల్–ఆగస్టు మధ్య ఏకంగా 43.76 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏకగవాక్ష అనుమతులు, జీఎస్టీ వంటి సంస్కరణలు దీనికి దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది.


