రెండేళ్లలో రెండింతలైన ఆర్డర్ల విలువ
కొత్త రుచులను పరిచయం చేసిన హోటళ్లు
పరిధి పెరిగిందంటున్న రెస్టారెంట్ ఓనర్స్
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి.
ఎన్‌సీఏఈఆర్ ఏం చెప్పిందంటే...
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేధోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అపైŠల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్‌సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది.
వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు.
రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి.
ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది.
ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది.
రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది.
కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సర్వీస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు.
దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్‌సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో..
» ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు.
» నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు
» కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు.
» 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.
ఫుడ్ యాప్స్ విశేషాలు..
» భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు.
» రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు.
» ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి.
» మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది.


