సైబరాబాద్‌లో మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు
2025లో 37,243 కేసులు నమోదు
ఇందులో 9 శాతం నేరాలు మహిళలపైనే
ఈ ఏడాది 1,314 వరకట్న వేధింపుల కేసులు
7,636 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.404 కోట్ల నష్టం
4,608 రోడ్డు ప్రమాదాలు : రూ.239 కోట్ల ట్రాఫిక్ జరిమానాలు
575 ఎన్‌డీపీఎస్ కేసుల్లో 1,228 మంది పెడ్లర్ల అరెస్టు
సైబరాబాద్ పోలీసు వార్షిక నివేదిక విడుదల
సాక్షి, సిటీబ్యూరో: అత్యాచారాలు, హత్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు.. ఏదో ఒక రూపంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2025లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,243 కేసులు నమోదు కాగా.. ఇందులో 9 శాతం మహిళలపై జరిగినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సైబరాబాద్‌లో 1,314 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి.
అలాగే షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 1,043 ఫిర్యాదులు అందగా.. వీటిలో 83 ఎఫ్‌ఐఆర్‌లు, 2,964 పెట్టీ కేసులు నమోదయ్యాయి. అలాగే 3,322 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. డెకాయ్ ఆపరేషన్స్‌తో 3,315 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 103 మానవ అక్రమ రవాణా కేసుల్లో 257 మందిని అరెస్టు చేశారు.
మొత్తంగా చూస్తే.. గతేడాదిలో నమోదైన 37,689లతో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్‌లో కేసులు 1.18 శాతం స్వల్పంగా తగ్గాయి. సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ సంబంధిత నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. అందులోని పలు కీలకాంశాలివీ..
తగ్గిన సైబర్ నేరాలు..
ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిన సైబరాబాద్‌లో ఈ ఏడాది సైబర్ నేరాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 11,914 క్రైమ్‌లు నమోదు కాగా.. 2025లో 35.9 శాతం మేర తగ్గి, 7,636లకు పరిమితయ్యాయి. వీటిలో 539 కేసుల్లో 917 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా పార్ట్ టైం జాబ్, ట్రేడింగ్, విషింగ్ కాల్, అడ్వర్టయిజ్‌మెంట్ మోసాలు జరిగాయి. 2025లో సైబర్ నేరాలలో బాధితులు రూ.404 కోట్ల మోసపోగా.. రూ.20.75 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు.
పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ..
ఐటీ హబ్‌గా పేరొందిన సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగిపోయింది. పిల్లల అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయి. గతేడాది సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు కేవలం నాలుగు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 53 కేసులు రిజిస్టరయ్యాయి. అలాగే ఆన్‌లైన్‌లో వేధింపులు, బెదిరింపులు (సైబర్ స్టాకింగ్), మ్యాట్రిమోనీ, డేటింగ్ మోసాలు కూడా పెరిగాయి. 2025లో 40 సైబర్ స్టాకింగ్, 34 మ్యాట్రిమోనీ, 13 డేటింగ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.
పెరిగిన డ్రగ్స్ కేసులు..
ఈ ఏడాది సైబరాబాద్‌లో రూ.16.85 కోట్ల విలువ చేసే 1,524 కిలోల మత్తు పదార్థాలు దొరికాయి. 575 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కేసులు నమోదు కాగా.. 1,228 మందిని అరెస్టు చేశారు. అత్యధికంగా రూ.8.33 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.3.30 కోట్ల విలువైన కొకైన్, రూ.4.27 కోట్ల విలువ చేసే హెరాయిన్ వంటివి ఉన్నాయి. అలాగే 2025లో సైబరాబాద్‌లో రూ.25.44 కోట్ల విలువ చేసే 2,730 కిలోల మత్తు పద్దార్థాలను ధ్వంసం చేశారు.
స్థిరంగానే కన్విక్షన్లు..
ఈ ఏడాది సైబరాబాద్‌లో నేర నిరూపణ (కన్విక్షన్లు) రేటు స్థిరంగానే ఉంది. వరుసగా రెండేళ్లు నేర నిరూపణలు 47 శాతం నమోదయింది. 2025లో మొత్తం 14,369 కేసులు డిస్పోజ్ కాగా.. ఇందులో 22 కేసుల్లో న్యాయస్థానం జీవితకాలం శిక్షలు విధించాయి. 22 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 కేసుల్లో 10 ఏళ్ల జైలు, 49 కేసుల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు విధించారు.
ట్రాఫిక్ జరిమానాలు డబుల్..ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపించారు. 2025లో కమిషనరేట్ పరిధిలో 36.20 లక్షల చలాన్లు జారీ చేసిన పోలీసులు.. ఆయా వాహనదారులకు ఏకంగా రూ.239.37 కోట్ల జరిమానాలు విధించారు. గతేడాది 22.60 లక్షల చలాన్లలో రూ.111 కోట్ల ఫైన్లు విధించారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
ఇందులో 803 ఘోరమైన యాక్సిడెంట్లలో 850 మంది మరణించారు. అత్యధికంగా 430 ప్రమాదాల్లో 449 మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడగా.. 283 కేసుల్లో 285 మంది పాదచారులు చనిపోయారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) కేసులు నమోదయ్యాయి.
2025లో 95 ఆర్థిక నేరాలలో 111 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.26.17 కోట్ల సొమ్మును స్తంభింపజేయగా.. రూ.11.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.


