గుడ్‌ సామరిటన్లకు..‘గోల్డెన్‌’ గిఫ్ట్‌! | Rah-Veer Scheme to reward Good Samaritans with Rs 25000 and certificates for saving road accident victims | Sakshi
Sakshi News home page

గుడ్‌ సామరిటన్లకు..‘గోల్డెన్‌’ గిఫ్ట్‌!

Feb 9 2026 6:14 AM | Updated on Feb 9 2026 6:14 AM

Rah-Veer Scheme to reward Good Samaritans with Rs 25000 and certificates for saving road accident victims

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆదుకుంటే రూ.25 వేల పారితోషికం 

కేంద్ర ప్రభుత్వ ‘రహ్‌ వీర్‌’పథకం అమలుకు రాష్ట్రం నిర్ణయం 

తొలి గంటలో సాయం చేసిన వారికి పురస్కారం..ప్రశంసా పత్రం 

చట్టపరంగా పూర్తి రక్షణ, కేసులుండవు..  వేధింపులుండవు

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పుతుంది.. కానీ ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేసుల్లో ఇరుక్కుని పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయమే ఇందుకు కారణం. వాస్తవానికి అలా సాయం చేసేవారికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయినా జనంలో అవగాహన రావటం లేదు. ఈ నేపథ్యంలోనే అలా క్షతగాత్రులకు సాయం చేసి ప్రాణాలు నిలిపిన వారికి రూ.25 వేల నగదు పారితోషికంతో పాటు ప్రభుత్వ ప్రశంసాపత్రం కూడా అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది.  

సర్కారు చొరవ 
కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కొన్ని చాలాకాలంగా తెలంగాణలో అమలులో లేవు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో ముఖ్యమైన వాటిని అమలులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించిన వారికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో క్షతగాత్రుల పాలిట గుడ్‌ సామరిటన్‌ (సహాయం చేసిన మంచి వ్యక్తి)కు ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తెచ్చింది.

 తొలుత రూ.5 వేల ఆర్థిక సహాయం మాత్రమే ఉండేది. దానికి అంత స్పందన రావటం లేదన్న ఉద్దేశంతో, గతేడాది ఈ పథకానికి ‘రహ్‌ వీర్‌’అని పేరు పెట్టి, ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ.25 వేలకు పెంచింది. దీన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి పథకం అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘రహ్‌ వీర్‌’లను ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది.  

ఎలాంటి ప్రమాదాల్లో... 
ప్రాణాపాయం కల్పించే పెద్ద ప్రమాదాల్లో క్షతగాత్రులను రక్షించే వారికి ఈ పురస్కారం అందుతుంది. పెద్ద శస్త్రచికిత్స అవసరం అవటం, కనీసం మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సినంత గాయం కావటం, మెదడు, వెన్నెముకలాంటి వాటికి తీవ్ర గాయాలు కావటం, చనిపోవటం.. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.  
క్షతగాత్రులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రి/ట్రామా కేర్‌సెంటర్‌కు తరలిస్తే వారికి ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పేర్కొంటారు. ఆ గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన వారిని ‘రహ్‌ వీర్‌’లుగా పరిగణనలోకి తీసుకుంటారు.  

నిర్భయంగా ముందుకొచ్చి క్షతగాత్రులు వీలైనంత తొందరలో ఆసుపత్రికి చేర్చేందుకు సాయం చేసిన వ్యక్తుల వివరాలను ఆసుపత్రి సిబ్బంది ద్వారా, లేదా స్వయంగా తెలుసుకుని సంబంధిత పోలీసులు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పనిచేసే కమిటీలకు వివరాలు అందిస్తారు.  
జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే కమిటీలో జిల్లా ఎస్పీ/ పోలీసు కమిషనర్, చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, ఆర్‌టీఓ/డీటీఓ/డీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నగదు పురస్కారానికి అర్హులను ఎంపిక చేసి సిఫారసు చేస్తుంది. వారికి రవాణా శాఖ ద్వారా పురస్కారం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ ఉంటుంది.  

క్షతగాత్రులకు గోల్డెన్‌ అవర్‌లో సాయం చేసిన వ్యక్తి ఒకరే ఉంటే అతనికి/ఆమెకు రూ.25 వేల పారితోషికం, ప్రశంసాపత్రం అందిస్తారు. ఇద్దరున్నా, ఎక్కువ మంది ఉన్నా.. వారికి రూ.25 వేల మొత్తాన్ని సమంగా పంచుతారు.  
ఆర్థిక సాయానికి సంబంధించి కేసులకు పరిమితి లేదు. ఎన్ని కేసులకు ఎంపిక చేసినా అన్నిటికీ పారితోషికం అందుతుంది. ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది.  

కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి రూ.25 లక్షల గ్రాంటును తొలి విడతగా అందించింది. ఎక్కువ అవసరమైతే ఆ మొత్తం ప్రతినెలా రీయింబర్స్‌ చేస్తుంది.  
మోటారు వాహన చట్టం (సవరణ) 2019 సెక్షన్‌ 134 ఏ ప్రకారం... రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తికి చట్టపరంగా రక్షణ కలి్పస్తారు. వారిని అనవసరంగా పోలీసు స్టేషన్‌లకు రప్పించటం, కోర్డు చుట్టూ తిప్పటం, బలవంతంగా వారి వివరాలు సేకరించటం లాంటివి ఉండవు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్భయంగా ముందుకొచ్చి ప్రమాద క్షతగాత్రులను రక్షించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వం కోరుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement