28న నింగిలోకి ‘రుద్రమ వి.1’ | Rudrama V1 launching into space on February 28th | Sakshi
Sakshi News home page

28న నింగిలోకి ‘రుద్రమ వి.1’

Feb 9 2026 4:36 AM | Updated on Feb 9 2026 4:43 AM

Rudrama V1 launching into space on February 28th

నమూనా రాకెట్‌ రుద్రమ వి.1 లాంచింగ్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న 

నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, కుడా వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్

కాజీపేట అర్బన్‌: హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానం నుంచి ఈనెల 28న నమూనా రాకెట్‌ రుద్రమ వి.1 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు నిట్‌ వరంగల్‌లోని సెమినార్‌హాల్‌లో నమూనా రాకెట్‌ లాంచింగ్‌ వాల్‌పోస్టర్‌ను నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, కుడా వైస్‌ చైర్‌పర్సన్, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్, ఏటీడీఆర్‌ఎల్‌ ప్రతినిధి శశాంక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ మాట్లాడుతూ నమూనా రాకెట్‌ను రుద్రమ వి.1 పేరిట ఆవిష్కరించి లాంచింగ్‌ చేయడం, ఇందులో నిట్‌ వరంగల్‌లోని ఆ్రస్టానమీ క్లబ్, శాటిలైట్‌ క్లబ్‌ విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

హయగ్రీవాచారి మైదానంలో నమూనా రాకెట్‌ రుద్రమ వి.1ను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. గతేడాది నాలుగు గ్రహాలు ఒకేసారి దర్శనమివ్వగా, ఈ ఏడాది ఏడు గ్రహాలను వీక్షించేందుకు ఈనెల 18 నుంచి 10 రోజులపాటు వరంగల్‌ హంటర్‌రోడ్డులోని భద్రకాళిబండ్‌పై నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాకెట్‌ లాంచింగ్‌ అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులతో ప్యానల్‌ చర్చలు, టాక్‌షో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిట్‌ వరంగల్‌లో అంతరిక్ష సాంకేతిక ప్రాజెక్టులతో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఇస్రో నోడల్‌ సెంటర్‌ కోఆర్డినేటర్, నిట్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.ఆంజనేయులు చెప్పారు. స్టార్టప్‌గా ఏర్పడిన ఏటీడీఆర్‌ఎల్‌ ద్వారా తొలిసారిగా నమూనా రాకెట్‌ రుద్రమ వి.1 లాంచింగ్‌కు ఏర్పాటు చేసినట్లు ఏటీడీఆర్‌ఎల్‌ ప్రతినిధి శశాంక్‌ తెలిపారు. శ్రీహరి కోటలో రాకెట్‌ లాంచింగ్‌ను తలపించే విధంగా హయగ్రీవాచారి మైదానంలో నమూనా రాకెట్‌ రుద్రమ వి.1 నిలవనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, నిట్‌ ప్రొఫెసర్‌ చయన్‌బార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement