నీలగిరి.. నువ్వానేనా? | Nalgonda Corporation was formed on the 14th of last month with 48 divisions | Sakshi
Sakshi News home page

నీలగిరి.. నువ్వానేనా?

Feb 9 2026 3:16 AM | Updated on Feb 9 2026 3:16 AM

Nalgonda Corporation was formed on the 14th of last month with 48 divisions

దృష్టి సారించిన మూడు పార్టీలు..ప్రదాన పోటీ కాంగ్రెస్‌– బీఆర్‌ఎస్‌ మధ్యే 

హైదరాబాద్‌ తరహాలో స్మార్ట్‌ సిటీ చేస్తామంటున్న కాంగ్రెస్‌ 

పదేళ్లలో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలంటున్న బీఆర్‌ఎస్‌ 

అభివృద్ధికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెస్తామంటున్న బీజేపీ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు జిల్లా అంతటా వామపక్ష రాజకీయాలు బలంగా ఉంటే జిల్లా కేంద్రమైన నీలగిరి మాత్రం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడ మున్సిపల్‌ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ పార్టీనే మున్సిపాలిటీపై తమ జెండా ఎగురవేసింది. 1951లో 8 వార్డులతో నీలగిరి మున్సిపాలిటీగా ఏర్పడగా, గత నెల 14వ తేదీన 48 డివిజన్లతో నల్లగొండ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. 1953లో మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరగ్గా, 2020లో చివరి ఎన్నికలు జరిగాయి. 

ప్రస్తుతం 14వసారి ఎన్నికలు జరుగుతుండగా, కార్పొరేషన్‌ అయ్యాయి మాత్రం ఇవి తొలిసారి. ఇప్పటివరకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని 8 సార్లు కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, బీజేపీ రెండుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీఆర్‌ఎస్‌ ఒకసారి దక్కించుకుంది. మొదటి చైర్మన్‌గా చిత్తలూరి వెంకట నర్సింహారావు (కాంగ్రెస్‌) 1961 వరకు సేవలు అందించగా, చివరి చైర్మన్‌గా 2024 నుంచి 2025 వరకు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి సేవలు అందించారు. 

తొలి మేయర్‌ పీఠంపై ప్రధాన పార్టీల దృష్టి 
కార్పొరేషన్‌ అయ్యాక జరిగే ఈ ఎన్నికల్లో మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. దీంతో నల్లగొండ తొలి మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్‌ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండగా, బీఆర్‌ఎస్‌ కూడా అదే ధ్యేయంతో నడుస్తోంది. బీజేపీ కూడా మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నా, గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యే కనిపిస్తోంది. 

ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ 
అన్ని పార్టీల కంటే ముందే నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మేయర్‌ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆ తర్వాతే బీఆర్‌ఎస్‌ రెండు విడతల్లో 42 మందిని ప్రకటించింది. ఆ తర్వాత మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. అయితే మేయర్‌ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా చకిలం వసంతలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీజేపీ మేయర్‌ అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రచారంలో చెప్పడం లేదు. 

ఏ పార్టీ ఏం చెబుతుందంటే.... 
» ముందునుంచే కాంగ్రెస్‌ ప్రచారంలో దూసుకుపోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు పూర్తయ్యాక ప్రతి రోజు నగరంలోని ఏడెనిమిది డివిజన్లలో పర్యటిస్తున్నారు. రోడ్‌ షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా వెచి్చంచి పట్టణంలో అభివృద్ధి చేశామని, ప్రజలు తమను గెలిపించాలని కోరుతున్నారు. మరిన్ని నిధులు తెచ్చి నల్లగొండను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. 

»  పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నల్లగొండలో ఎక్కువ అభివృద్ధి తామే చేశామని, దానిని చూసి తమను గెలిపించాలని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. మాజీమంత్రి జగదీశ్‌రెడి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కేసీఆర్‌ నల్లగొండను దత్తత తీసుకొని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెబుతోంది. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్, ఫ్‌లైఓవర్ల నిర్మాణం, ఐటీ హబ్‌ వంటికి తామే చేశామని చెబుతోంది. 

»  నల్లగొండ అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తామని, తమ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ చెబుతోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున అభివృద్ధి చేసిందని పేర్కొంటోంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement